గిరిజన విశ్వవిద్యాలయానికి సమ్మక్క, సారక్క పేరు పెట్టి కేంద్రం తెలంగాణ సంస్కృతిని గౌరవించిందని, యూనివర్సిటీకి ఇచ్చిన 50 ఎకరాలకు క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి మంజూరు చేసిన యునివర్సిటీ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని, యూనివర్శిటీ కి భూమి కోసం వెంటపడి, ఉత్తరాలు రాశానన్నారు. గిరిజన యునివర్సిటీ ఆలస్యానికి కేసీఆర్ ప్రభుత్వానిదే బాధ్యత అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 10 సంవత్సరాలుగా గిరిజన రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, గిరిజన రిజర్వేషన్లు ఇవ్వకుండా వారికి అన్యాయం చేశారన్నారు. బట్టకాల్చి మీద వేయడంలో కేసీఆర్ దిట్ట.. ఆస్కార్.. నోబెల్ బహుమతులు ఇవ్వవచ్చని, కృష్ణ వాటర్ పంపిణీ జరగకపోవడానికి ప్రధానకారణం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన ధ్వజమెత్తారు.
అంతేకాకుండా.. ‘అధికారం తలకెక్కి డబ్బుల అండతో తెలంగాణను ఏమైనా చేస్తామని అహంకార పూరితంగా విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తె టూరిస్ట్ అని ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీని మోడీ వస్తె కనీసం కలవడం చేతకాదు కానీ.. పోస్టర్లు వేస్తారు. బయ్యారం స్టీల్ కర్మాగారం పెడతానని ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడైనా చెప్పారా.? కేంద్రం ఇవ్వకపోయినా స్టీల్ ఫ్యాక్టరీ నేనే పెడతా అని కేసీఆర్ చెప్పిన విషయం గుర్తు చేశారు. అనేక కమిటీలు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఫీజుబులిటీ లేదని తేల్చి చెప్పాయి. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ను 35 వేల కోట్లతో ప్రారంభించి 55 కోట్ల రూపాయలకు ప్రారంభించారు. 22 వేల కోట్ల భారం ప్రజలపై వేశారు. రిజర్వాయర్లు పూర్తి కాలేదు కానీ ఫోజులు మాత్రం కొడుతున్నారు.
రేపు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు. సమావేశాల్లో జే.పీ. నడ్డా పాల్గొంటారు. ఎన్నికల ఎజెండా పై ప్రధాన చర్చ జరుగుతుంది. బీఎల్ సంతోష్ తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు. ఈ నెల 10వ తేదీన తెలంగాణ లో అమిత్ షా పర్యటిస్తారు. కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. అదిలాబాద్ కి ఎంత కేటాయిస్తున్నారు ? హైదరాబాద్ కు ఎంత కేటాయిస్తున్నారు ? నోరుంది కాబట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అంటే కేటీఆర్ అభద్రత భావంతో ఉన్నారు. ప్రగతి భవన్ లో కల్వకుంట్ల కుటుంబం ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంటుంది. ప్రధాన మంత్రిని కలవరు.. ఫార్మ్ హౌస్ లో ఉండి కేసీఆర్ విజయం సాధించామని డబ్బా కొట్టుకుంటారు. ఐటీ దాడులు రొటీన్ ఆక్టివిటీ.. ఎన్నికలకు, మాకు సంబంధం లేదు’ అని కిషన్ రెడ్డి తెలిపారు.