ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఐక్య వేదిక నాయకులు సమావేశం అయ్యారు. రేణుకా చౌదరి తో పాటూ పలువురు నేతలు ఈ కార్యక్రమంలో ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ వాళ్ళకు టికెట్లు ఇవ్వాలని మల్లిఖార్జున ఖర్గేను కమ్మ వారి ఐక్య వేదిక నేతలు కోరారు. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి ఎటువంటి ప్రాధాన్యం లేదనే ఆవేదన వ్యక్తం అయ్యింది అని ఆమె అన్నారు. ఈ సారి ఎన్నికల్లో సామాజిక సమతౌల్యం పాటిస్తూ కమ్మ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యం లభిస్తుంది అనే ఆశాభావం రేణుకాచౌదరి వ్యక్తం చేశారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే ఖచ్చితంగా అవకాశం కలిపిస్తామని హామీ ఇచ్చారు అని రేణుకాచౌదరి అన్నారు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు.. వివిధ రాష్ట్రాల నుండే కాకుండా ఎన్నారైలు కూడా మా డిమాండ్ కు మద్దతు పలుకుతున్నారు.. కమ్మ సామాజిక వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూడకుండా రాజకీయంగా సరియైన అవకాశం కల్పించాలి.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కమ్మ సామాజిక వర్గానికి సరియైన అవకాశాలు లభించడం లేదన్న ఆవేదన ఉంది అని రేణాకా చౌదరి పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ గెలుపులో కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యతను గుర్తించాలి అని రేణాకా చౌదరి అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి 10 సీట్లు కేటాయించాలి అని కమ్మవారి ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు.