బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో బండి సంజయ్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై విసిగిపోయిన ప్రజలు ఎప్పుడెప్పుడు ఓడించాలా? బీజేపీకి ఓటేయాలని ఎదురు చూస్తున్నారు అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ శ్రేణులు మాత్రం ఆశించిన స్థాయిలో యాక్టివ్ గా పనిచేయడం లేదు అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీ గొంతుకగా మారి ప్రజల పక్షాన పోరాడాలి.. ప్రతి బీజేపీ కార్యకర్తలో మోడీ ఆవహించాలి.. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేదాకా పోరాడాలి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కనబడటం లేదని టెన్షన్ పడుతున్నారా? కేసీఆర్ బేషుగ్గా ఉన్నాడట.. చుక్క ముక్క వేసుకుని ఎంజాయ్ చేస్తున్నడట అని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ సడ్డకుడి కొడుకును ఇంటికి రానీయడం లేదు.. కేసీఆర్ కుటుంబంలో లొల్లి స్టార్టైందన్నారు. మోడీ చెప్పింది అక్షరాల నిజం.. కేసీఆర్ బట్టేబాజ్ మాటలు మాట్లాడతాడు.. కొడుకును సీఎం చేయాలనుకున్నాడు.. హరీశ్ రావు అలిగిండు.. కవిత ఇంట్లోనే మకాం వేయడంతో సీఎంను చేసే నిర్ణయాన్ని వాయిదా వేసిండు.. కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే, మనిషివైతే కేటీఆర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశాడు.
తెలంగాణపై కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పు చేసిండు అని బండి సంజయ్ ఆరోపించాడు. వాటిని ఎట్లా తీరుస్తుందో బీఆర్ఎస్, చెప్పడం లేదు.. ఈ సమస్యకు ఏకైక పరిష్కారం మోడీ ప్రభుత్వం చూపుతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అప్పులు తీరతాయి.. లేకపోతే తెలంగాణ పరిస్థితి శ్రీలంకలా తయారయ్యే ప్రమాదముంది అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు బీజేపీ పట్ల విశ్వాసంగా ఉన్నారు. ఆదరిస్తున్నరు. అందుకు అనుగుణంగా కష్టపడి పోరాడి కేసీఆర్ పాలనను గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గాలిలో కొట్టుకుపోతోంది.. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులే లేరుని ఆయన ఆరోపించారు.
కేవలం ఒక సెక్షన్ మీడియా కాంగ్రెస్ ను లేపుతోంది. అటు ఇటు కానోడిని ఎంత లేపితే మాత్రం సంసారానికి పనికివస్తాడా? కాంగ్రెస్ ది కూడా అదే పరిస్థితి అంటూ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబం కావాలనే కాంగ్రెస్ ను తిడుతూ బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసే కుట్ర చేస్తోంది అని ఆయన అన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేది బీఆర్ఎస్ పార్టీ.. ఎందుకంటే బీజేపీ కనుక అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ కు పుట్టగతులుండవని, అవినీతిని లెక్కించి జైలుకు పంపుతారనే భయం కేసీఆర్ కు పట్టుకుంది.. ప్రధాని మోడీ కూడా ఇదే చెప్పడంతో కేసీఆర్ కు ఏకంగా జ్వరం వచ్చింది అని బండి సంజయ్ చెప్పారు.
హోంమంత్రి మహమూద్ అలీ ఎందుకు మంత్రిగా ఉన్నాడో తెల్వదు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పోలీస్ ను చెంప మీద కొట్టిండు.. పూలబోకే ఇవ్వలేదని కొట్టిండు.. సిగ్గుండాలే. పోలీసులేమైనా నీ ఇంటి పనిమనుషులనుకున్నవా? ఇదేం పద్దతి? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులంతా బీఆర్ఎస్ లో ఉన్నారు.. పదవులు అనుభవిస్తున్నారు.. 4 కోట్ల మంది ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. 4 గురే రాజ్యమేలుతుంటే ఇంకెన్నాళ్లు భరించాలి.. ఇక సమయం లేదు.. ఇదే లాస్ట్. ఎన్నికలే ఫైనల్.. పొరపాటున కేసీఆర్ మళ్లీ సీఎం అయితే రాష్ట్రం సర్వనాశనమైతది అంటూ బండి సంజయ్ ఆరోపించారు.