Leading News Portal in Telugu

Bhatti Vikramarka: బీఆర్‌ఎస్‌ బీజేపీకి బీ టీమ్‌.. భట్టి కీలక వ్యాఖ్యలు


Bhatti Vikramarka: రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ మోసం చేసి ఓట్లను కొల్లగొట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా అనాసాగరం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో పేరుతో మరోసారి భ్రమలు కల్పించేందుకు బీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోందన్నారు. మూడు ఎకరాలు, ఇంటికో ఉద్యోగం పేరుతో గతంలో చేసిన మోసం మళ్ళీ చేయనున్నారని ఆయన ఆరోపించారు. మోసం చేసే కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజల కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, దొరల కోసం కాదన్నారు. బీఆర్‌ఎస్ బీజేపీతో చేతులు కలిపి బీజేపీకి బీ టీమ్‌గా మాదిరిగా పనిచేస్తోందని భట్టి ఆరోపించారు. ఎంఐఎం ఈ టీమ్‌కు వంత పలుకుతోందన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేయడం బీజేపీ వేయడమేనని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రం రెండింటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని పని చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగర భూములను అమ్మేసుకున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు.

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను ఆరు నెలల్లో అమలు చేస్తామన్నారు. జాతీయ పార్టీగా జాతీయ స్థాయిలో కూటమిగా ఉన్న పార్టీలతో చర్చలు సాగుతున్నాయన్నారు. లెఫ్ట్‌ పార్టీలతో కలసి పోవడం కోసం చర్చలు సాగుతున్నాయన్నారు. లెఫ్ట్ పార్టీ అధిష్ఠానంతో చర్చలు చేస్తోందన్నారు. అభ్యర్థుల ప్రకటన నామినేషన్ సమయంలో కాంగ్రెస్ ప్రకటన చేస్తుందన్నారు. అభ్యర్థులపై సంపూర్ణ కసరత్తు జరుగుతోందని ఆయన చెప్పారు. పద్దతి ప్రకారం ఇప్పటికే అభ్యర్థుల ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు. ప్రకటన త్వరలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఇంకా జరుగలేదని.. మీడియాలో వస్తున్న లిస్ట్ కథనాలపై పార్టీకి ఎటువంటి సంబందం లేదన్నారు. అవన్నీ అభూత కల్పన మాత్రమేనన్నారు. లెఫ్ట్ కు కేటాయించిన సీట్లు ఇవే అంటూ తప్పుడు కథనాలు నమ్మవద్దన్నారు. చర్చలు జరుగుతున్న మాట వాస్తవమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.