Suspicious Death: హైదరాబాద్లోని మాదాపూర్లో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మాదాపూర్లోని గోల్డెన్ హైవ్ ఓయో లాడ్జిలో ప్రియ ( 25) అనే యువతి అనుమానాస్పద స్థితి మృతి చెందింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
అసలేం జరిగిందంటే.. మంగళవారం రాత్రి పాండిచ్చేరికి చెందిన ప్రియా(25), చెన్నైకి చెందిన శ్రీహరి(26) నగరానికి వచ్చారు. వీరిద్దరూ పాండిచ్చేరిలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్రియ, శ్రీహరి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రియుడు శ్రీహరి చెన్నైలో బిజినెస్ చేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన ప్రియుడు శ్రీహరి మాదాపుర్ చంద్రనాయక్ తాండలోని గోల్డెన్ హైవ్ ఓయో లాడ్జి 3వ అంతస్తులో రూం బుక్ చేశాడు. మంగళవారం రాత్రి పాండిచ్చేరి నుంచి ప్రియురాలు ప్రియ వచ్చినట్లు తెలిసింది. ఇద్దరు కలిసి లాడ్జిలో మద్యం సేవించారు.
ఈ నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ అవ్వడంతో ఈరోజు ఉదయం శ్రీహరి హాస్పిటల్కు వెళ్లాడు. ఈ క్రమంలో శ్రీహరి ఆస్పత్రికి వెళ్లి వచ్చేసరికి రూంలో కూర్చున్న ప్రియ కుర్చీలోనే మృతి చెందింది. ప్రియుడు శ్రీహరి హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చి పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మద్యం బాటిల్స్, ఫుడ్ శాంపిల్స్ పలు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా ఐపీసీ సెక్షన్ 174 కేసు నమోదు చేసుకొని మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.