Leading News Portal in Telugu

Top Headlines @9PM : ట్యాప్‌ న్యూస్‌


Top Headlines @9PM : ట్యాప్‌ న్యూస్‌

స్వతంత్య్ర పాలస్తీనా ఏర్పాటుకు ఇండియా మద్దతు..

ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై జరిపిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. మా విధానం దీర్ఘకాలంగా స్థిరంగా ఉంది, పాలస్తీనా సార్వభౌమ, స్వతంత్ర, ఆచరణీయ రాజ్యాన్ని స్థాపించడానికి, సురక్షితమైన, గుర్తింపు పొందిన సరిహద్దుతలతో, ఇజ్రాయిల్ తో శాంతియుతంగా పక్కపక్కన నివసించే దిశగా ప్రత్యక్ష చర్యల పునరుద్ధరణకు భారతదేశం ఎల్లప్పుడు సమర్థిస్తుందని బాగ్చీ చెప్పారు. ఇజ్రాయిల్, గాజాలోని మానవతా పరిస్థితిని గురించి ప్రశ్నించగా.. మనవతా చట్టాన్ని పాటించడం సార్వత్రిక బాధ్యత అని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న దానితో పోరాడాల్సిన బాధ్యత ఉందని ఆయన వెల్లడించారు.

ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఇకపై కులధ్రువీకరణ పత్రం శాశ్వతం

ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. ఒకసారి కుల ధ్రువీకరణ పత్రం జారీ చేస్తే దానిని శాశ్వతంగా పరిగణించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు, విద్యార్థులు, లబ్ధిదారులను ఒత్తిడి చేయొద్దని స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు గ్రామ సచివాలయాల్లోనే ఆరు దశల తనిఖీ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ సర్టిఫికెట్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. డిజీ లాకర్లతో సర్టిఫికేట్లు కులం, స్థానికత, పుట్టిన తేదీ సర్టిఫికేట్ల నిబంధనలకు సంబంధించి జీవో ఎంఎస్‌ నంబర్‌ 469, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం జీవో ఎంఎస్‌ 484ను విడుదల చేసింది.

నరరూప రాక్షకులు వీళ్లు.. హమాస్ ‘అల్-నుఖ్బా’ ఫోర్స్ గురించి కీలక విషయాలు..

ఇజ్రాయిల్ కలలో కూడా ఊహించని విధంగా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ భీకరదాడికి పాల్పడింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పైకి నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించమే కాకుండా, ఇజ్రాయిల్ లోకి పారా గ్లైడర్ల ద్వారా ఉగ్రవాదులు ప్రవేశించి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మందిని దారుణంగా హతమార్చారు. 40 మంది చిన్నారుల తలలు నరికి హత్య చేయడాన్ని ఇజ్రాయిల్ జీర్ణించుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్ పై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది.

ఇదిలా ఉంటే ఈ దాడిలో హమాస్ ఉగ్రసంస్థకు చెందిన ఎలైట్ ఫోర్స్ ‘అల్-నుఖ్బా’ ఫోర్స్ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఈ నరరూప దళాన్ని టార్గెట్ చేస్తోంది. అల్-నుఖ్బా అంటే అరబిక్ లో ఎలైట్ అని అర్థం. ఈ ‘అల్-నుఖ్బా’ హమాస్ సైనిక విభాగమైన ఇజ్ అల్-దిన్అల్- కస్సామ్ బ్రిగేడ్స్ ర్యాంకులో ప్రధాన పోరాట విభాగం.

అరుపులతో దద్దరిల్లిన కోర్టు హాల్.. బెంచ్‌ దిగి వెళ్లిపోయిన జడ్జి

కాల్‌డేటా రికార్డులపై విచారణ సందర్భంగా విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఏసీబీ కోర్టులో చంద్రబాబు, సీఐడీ లాయర్ల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో ఇరుపక్షాల లాయర్ల మధ్య వాదన పెరిగింది. ఈ నేపథ్యంలో అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌లో ఉన్న వారు మినహా అందరూ బయటకు వెళ్లాలని జడ్జి ఆదేశించారు. న్యాయవాదుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. ఈ విధంగా ఉంటే విచారణ కష్టమంటూ బెంచ్‌ దిగి వెళ్లిపోయారు.

ఇవాళ ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డులపై విచారణ జరిగింది. సీఐడీ అధికారుల కాల్‌డేటా ఇవ్వాలంటూ టీడీపీ వర్గాలు పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. పిటిషన్ వేసి ఇప్పటికే నెల రోజులైందని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ జడ్జికి వివరించగా.. అసలు పిటిషనుకు అర్హతే లేదని సీఐడీ న్యాయవాది వివేకానంద తెలిపారు. ఈ క్రమంలో ఇరు పక్షాల న్యాయవాదుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో న్యాయవాదులపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్న వాళ్లు తప్ప అందరూ బయటకెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ.. ఈ విధంగా ఉంటే విచారించాలేనంటూ బెంచ్ దిగి వెళ్లిపోయారు.

త్వరలో డీఎస్సీ.. మంత్రి బొత్స కీలక ప్రకటన

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో త్వరలోనే విద్యా శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. యూనివర్శిటీలు, ఐఐటీల్లో ఖాళీగా ఉన్న 3,200కు పైగా పోస్టులను కొద్ది రోజుల్లోనే భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని స్పష్టం చేశారు. దాదాపు 18 ఏళ్లుగా వర్శిటీల్లో శాశ్వత పోస్టుల భర్తీ జరగలేదని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ట్రిపుల్ ఐటీల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తామన్నారు. యూనివర్సిటీల వారీగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తామన్నారు.

సీఎం కేసీఆర్‌ మీద, హుజూరాబాద్‌లో రెండు చోట్లా పోటీ చేస్తా

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఢీకొనేందుకు ఉవ్విళ్లూరుతున్న ఈటల రాజేందర్ తన వైఖరిని ప్రకటించారు. హుజూరాబాద్‌తో పాటు కేసీఆర్‌పై పోటీ చేయనున్నట్లు ప్రకటించారు ఈటల రాజేందర్‌. గజ్వేల్‌, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నందున ఈటల గజ్వేల్ నుంచి పోటీ చేయాలా లేదా కామారెడ్డి నుంచి పోటీ చేయాలా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

డికాక్ సెంచరీల మోత.. సరికొత్త రికార్డు..!

వన్డే వరల్డ్ కప్-2023 లో భాగంగా ఈరోజు సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్‌ డికాక్‌ చరిత్ర సృష్టించాడు. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను బ్యాటింగ్ కు పంపింది. ఈ మ్యాచ్ లో డికాక్ మరో సెంచరీ బాదాడు. దీంతో జట్టుకు శుభారంభాన్ని అందించగా.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ 29.5వ ఓవర్లో ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది సెంచరీ పూర్తి చేశాడు. ప్రపంచకప్‌-2023లో క్వింటాన్ డికాక్ వరుసగా రెండోసారి సెంచరీ సాధించాడు. దీంతో అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకం నమోదు చేశాడు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన సౌతాఫ్రికా క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌(4), హషీం ఆమ్లా(2), ఫాఫ్‌ డుప్లెసిస్‌(2), హర్షల్‌ గిబ్స్‌(2)లు చేయగా.. డికాక్ కూడా రెండోస్థానంలో నిలిచాడు.

చంద్రబాబుకు అస్వస్థత.. వైద్యుడిని జైలుకు పిలిపించిన అధికారులు

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చర్మ సంబంధిత అస్వస్థతతో బాధపడుతున్నారు. తీవ్ర ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా చర్మ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో చర్మ వ్యాధి వైద్య నిపుణులను పంపించాలని జైలు అధికారులు రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంటుకు లేఖ రాశారు.

అత్యవసరంగా పంపించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసరును జీజీహెచ్ అధికారులు కేటాయించారు. దీంతో వైద్య బృందం జైలులోకి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును పరీక్షించింది. చంద్రబాబు విషయంలో జైలు అధికారులు నిరంతరం అలర్ట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. జైలు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

లోకేశ్ ఓ చెల్లని కాగితంతో సమానం..

రాష్ట్రంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను అని చెప్పుకుంటున్న వ్యక్తి ఓ దొరికిపోయిన దొంగ అని మంత్రి మేరుగ నాగార్జున విమర్శలు గుప్పించారు. దొంగ దొరికిపోయి మరలా కొన్ని యంత్రాంగాలను కదిలిస్తున్నాడని ఆయన అన్నారు. కొన్ని మీడియాలను, రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకున్నాడని మంత్రి ఆరోపించారు. కొంతమంది కుటుంబ సభ్యులను ఇతర పార్టీలకు పంపి రాజీలు, రాజీనామా రాజకీయాలు నడుపుతున్నారని అన్నారు.

ఓ కార్పొరేటర్ కూడా కానీ లోకేష్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారని, లోకేష్‌ను వాళ్ల పెద్దమ్మ పురంధేశ్వరి తీసుకెళ్ళి కలిపిందని ఆయన పేర్కొన్నారు. వీళ్ళందరూ అవసరమైతే ఒకటే పార్టీ అంటూ ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేయటానికి చంద్రబాబు అండ్ కో పని చేస్తుందన్నారు. లోకేష్ ఓ చెల్లని కాగితంతో సమానమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జ్ఞానం, అవగాహన లేని వ్యక్తి లోకేష్ అంటూ మాట్లాడారు. మైకు పట్టుకుంటే వాళ్ళ సంగతి చూస్తా, వీళ్ళ సంగతి చూస్తా అంటూ చెప్పే వ్యక్తి రాష్ట్ర రాజకీయాలకు పనికి రాడని మంత్రి నాగార్జున వ్యాఖ్యానించారు.

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్‌ నుంచి 7 స్టార్‌ హోటల్స్‌ నిర్మాణానికి మహీంద్ర గ్రూప్‌ సంసిద్దత వ్యక్తం చేసింది. ఒక్కో హోటల్‌ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మహీంద్ర గ్రూప్‌ ప్రతినిధులు సీఎంకి వివరించారు.

ఏపీలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహీంద్ర గ్రూప్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు. విశాఖ సహా మరో 2 పర్యాటక ప్రాంతాల్లో స్టార్‌ హోటల్స్‌ నిర్మాణాన్ని మహీంద్ర గ్రూప్ చేపట్టనుంది. వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు సమాయత్తమవుతున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో మహీంద్ర గ్రూప్‌ గ్లోబల్‌ హెడ్, అడ్మినిస్ట్రేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీవీఎన్‌ వర్మ, క్లబ్‌ మహీంద్ర సీవోవో సంతోష్‌ రామన్, టెక్‌ మహీంద్ర విజయవాడ అడ్మిన్‌ మేనేజర్‌ బిరుదుగడ్డ జయపాల్‌ పాల్గొన్నారు.