
బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయన్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడుల్లో దొరికిన 40 కోట్లు కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంట్లోనివే అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ చూస్తుందని, గతంలో కర్ణాటక లో 40 శాతం కమిషన్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు 50 శాతం కమిషన్ నడుస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. అక్కడ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసి తెలంగాణ కి డబ్బులు తరలిస్తున్నారని, 1500 కోట్లతో తెలంగాణలో గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు.
అంతేకాకుండా.. ‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సగం సీట్లో అభ్యర్థులు కరువు. పక్క పార్టీల నుంచి వచ్చేవాళ్ళ కోసం కాంగ్రెస్ దిక్కులు చూస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో హంగామా తప్ప గ్రౌండ్ లెవెల్ లో బలం లేదు. కర్ణాటకలో కొత్తగా ఎవరైనా ఇల్లు కడితే ఓ SFT కి 75 రూపాయల డబ్బులు కట్టాలి. కాంగ్రెస్ పార్టీ కాదు అది స్కాంగ్రెస్ పార్టీ. బెంగళూరు వయా చెన్నై కొంత హైదరాబాద్ కి కూడా డబ్బులు చేరాయి. కొంత మంది బిల్డర్లకు డబ్బులు వచ్చాయని తెలిసింది వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తానని అనుకోవడం ఓ పగటి కల. కాంగ్రెస్ లో డబ్బుల్లోనోళ్ళకే టికెట్.. కాంగ్రెస్ ఎన్ని నోట్ల కట్టలు పంచినా, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.