Leading News Portal in Telugu

BRS Election Manifesto 2023: బీఆర్ఎస్ మేనిఫెస్టో రెడీ..! ఏ వర్గాలకు ప్రాధాన్యత.. ఏటువంటి హామీలు ఉంటాయి ?


BRS Election Manifesto 2023: బీఆర్ఎస్ మేనిఫెస్టో రెడీ..! ఏ వర్గాలకు ప్రాధాన్యత.. ఏటువంటి హామీలు ఉంటాయి ?

BRS Election Manifesto 2023: తెలంగాణలో ఎలక్షన్ హీట్ మొదలైంది. బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించింది. మేనిఫెస్టోనూ అందరి కంటే ముందే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ నెల 15న మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ , బీజేపీలు కొన్ని హామీలు ప్రకటించడంతో.. వాటికి ధీటుగా హామీలు ఉండేలా గులాబీ పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా నాలుగైదు వర్గాలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.

అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా రైతు బంధు, రైతు బీమా పథకాల కింద ఇస్తున్న నగదును మరింత పెంచే హామీ మేనిఫెస్టోలో ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక, మహిళల సాధికారత కోసం ఫోకస్ ఉంటుందనీ చెబుతున్నాయి. ఇందులో భాగంగా గృహిణులకు ఊరట ఇచ్చేలా వాగ్దానాలు ఉంటాయని అంటున్నారు. మరోవైపు.. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పథకాల అమలును మరింతగా ముందుకు తీసుకుపోయే విధంగా మేనిఫెస్టోలో అంశాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. సామాజిక భద్రత లో భాగంగా ఇస్తున్న వివిధ రకాల పెన్షన్లకు ఇస్తున్న నగదు సాయం మరింత పెంచే అవకాశం ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మధ్య తరగతి వర్గాలు కవర్ అయ్యేలా మరో హామీని కూడా పొందు పరిచారని సమాచారం. ఇటు యువతకు దగ్గర అయ్యేందుకు కూడా హామీలు ఉంటాయని తెలుస్తోంది. 2018 మేనిఫెస్టోతో పోల్చితే.. దాదాపు అన్ని వర్గాలు కవర్ అయ్యేలా 2023 మేనిఫెస్టో ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

ఈ మధ్య గులాబీ పార్టీ బాస్‌, సీఎం కేసీఆర్‌.. అనారోగ్య సమస్యలతో కాస్త ఇబ్బంది పడ్డారు.. ఆ తర్వాత ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు.. అయితే, కేసీఆర్‌ జబర్దస్త్‌గా ఉన్నారు.. మన కోసం పనిచేస్తున్నారు.. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు.. ఎలాంటి హామీలు ఇస్తున్నారని గమనిస్తున్నారు.. ఒక్కసారి సింహం బయటకు వస్తే.. అది వేరే లెవల్ అనే విధంగా మంత్రి కేటీఆర్‌ కామెంట్లు చేశారు.. సీఎం కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటూనే పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు చేశారట.. ఇప్పటికే కాంగ్రెస్‌ హామీలు.. బీజేపీ ప్రకటనలు గమనిస్తున్న గులాబీ దళపతి.. వాటిని తలదన్నెలా మేనిఫెస్టో తయారు చేశారనే ప్రచారం సాగుతోంది.