Leading News Portal in Telugu

Kishan Reddy : ప్రజలు రానున్న ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి


Kishan Reddy : ప్రజలు రానున్న ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి

విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య బాధాకరమన్నారు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం కోసం అప్పు చేసి మరీ కోచింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకొని పరీక్షలకు ప్రిపేర్ అయ్యిందన్నారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే పరీక్షల్లో తప్పిదాల కారణంగా వాయిదా పడడంతో తీవ్ర మనస్థాపం చెందిందని ఆయన వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ బోర్డు తప్పిదాల కారణంగా 17 సార్లు పరీక్షలు వాయిదా పడ్డాయన్నారు కిషన్‌ రెడ్డి. పేపర్లు లీకయ్యాయని ఆయన మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ బోర్డు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పేపర్లు లీకయ్యాయి. లక్షలాది మంది నిరుద్యోగులు ఆవేదనకు గురయ్యారని కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

అంతేకాకుండా.. ‘ప్రభుత్వమే నోటిఫికేన్లు వేస్తుంది…ఆ పరీక్షలు వాయిదా పడేలా కోర్టుల్లో స్టే తెప్పిస్తుంది. ఇది పరిస్థితి. టీఎస్ పీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాల, అసమర్థత కారణంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృహల్లో మునిగి పోయారు. ప్రవళిక ఆత్మహత్య వార్త తెలియగానే వేలాది మంది యువత అశోక్ నగర్ కు వచ్చారు. పోలీసులు విచక్షణారహితంగా యువతీ యువకులపై లాఠీ ఛార్జ్ చేసారు. మా పార్టీ ఎంపీ లక్ష్మణ్ గారిని అరెస్ట్ చేసారు. అమావనీయంగా వ్యవహరించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ కు తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలనే యావ తప్ప మరే ఎజెండా లేదు. తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం 1200మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

గంగపుత్రుల కుల సంఘాలతో పాటు సకల జనులు స్వారాష్ట్రం కోసం పోరాటం చేసారు. సాగరహారం, మిలియన్ మార్చ్, రైల్ రోకో, వంటావార్పు వంటి అనేక నిరసనలు, పోరాటాలతో రాష్ట్రం ఏర్పాటైంది. సకలజనుల పోరాటంతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం మాత్రమే పాలిస్తోంది. కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తెలంగాణ రాత రాస్తున్నరు. ప్రజలు రానున్న ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుల సంఘాలకు, అన్ని పార్టీలకు, ప్రజలకు డబ్బులతో మభ్యపెట్టి ఓట్లు కొనాలని చూస్తున్నారు. అంగట్లో పశువుల్లా నాయకులను కొంటున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షల కోసం ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.