
తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. దాదాపు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. నేడు 51 మంది అభ్యర్థులకు బీ ఫామ్ అందించారు. అంతేకాకుండా.. ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ఎన్నికలొచ్చాయి కదా… బీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు మల్ల కనపడుతున్నరు. గత 9 సంవత్సరాలల్ల ఈ కేసీఆర్ గారి అసత్య వాగ్దానాలను, మోసాలను, దుర్మార్గాలను, దోపిడీ ధోరణులను, ద్రోహాలను రాజకీయాలకు అతీతంగా మన తెలంగాణవాదులం నిరంతరం ఇప్పటికెల్లి జన సామాన్యానికి తెలియజెయ్యాల్సిన సందర్భం ఇది. 5 లక్షల కోట్ల అప్పు తెలంగాణ బిడ్డల నెత్తికి పెట్టి, లక్ష కోట్లకు పైగా పైసలు ఈ ముఖ్యమంత్రిగారి కుటుంబం లూటీ చేసి, మల్లా మరోసారి వాళ్లని నమ్మమంటున్రు. “జాగ్ రెహ్‌నా”… తెలంగాణ సర్వ జనులారా… “తెలంగాణల దొంగలు పడ్డరు” 2014, 2018 ల (టీఆర్‌ఎస్, కేసీఆర్ అండ్ కో… అనే పేర్లతో) 2023 అట్లా ఉండరాదు ఇప్పుడైనా… హర హర మహాదేవ.. మీ రాములమ్మ’ అని అంటూ విమర్శలు గుప్పించారు విజయశాంతి.
ఇదిలా ఉంటే.. విజయశాంతి గత కొంతకాలంగా బీజేపీ తీరుపై అసంతృప్తిగా కనిపిస్తున్నారు. బీజేపీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని, తన శక్తి సామర్థ్యాలను కమలదళం సరైన విధంగా వినియోగించుకోవడం లేదని గత కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు విజయశాంతి. తనను ఏ బహిరంగ సభలకు ఆహ్వానించడం లేదని.. ఆహ్వానించినా మాట్లాడనివ్వడం లేదనేది విజయశాంతి ప్రధాన ఆరోపణ. దీనికితోడు కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసిన బీజేపీ జాతీయ నాయకత్వం చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతోందని అంతర్గత సమావేశాల్లో రగిలిపోతున్నారు విజయశాంతి. ఇటీవల కొంతమంది బీజేపీ నేతలు నిర్వహించిన రహస్య సమావేశాల్లో కీరోల్ పోషించారు విజయశాంతి. అయితే.. ఇప్పటికీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు.. ఈ సారి బీజేపీ నుంచి విజయశాంతికి సీటు వరిస్తుందా.. లేకుంటే.. ఎంపీగా పోటీ చేస్తారో చూడాలి.