Leading News Portal in Telugu

Kishan Reddy : గతంలో ఇచ్చిన హామీలు మరిచి మభ్యపెట్టేందుకు కొత్తవి ఇస్తున్నారు


Kishan Reddy : గతంలో ఇచ్చిన హామీలు మరిచి మభ్యపెట్టేందుకు కొత్తవి ఇస్తున్నారు

మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి. సకల జనుల ద్రోహి కేసీఆర్​, గతంలో ఇచ్చిన హామీలు మరిచి మభ్యపెట్టేందుకు కొత్తవి ఇస్తున్నారన్నారు కిషన్‌ రెడ్డి. దళితుడిని సీఎం ఎప్పుడు చేస్తావ్​? దళితులకు మూడు ఎకరాలు ఏమైంది? నిరుద్యోగ భృతి ఒక్కరికన్నా ఇచ్చినవా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​ ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ఎన్నికల ప్రణాళిక బయటపెట్టారని,
2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదన్నారు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న కేసీఆర్​ తీరన్నారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల స్థలం, నిరుద్యోగ భృతి, నిజాం షుగర్​ ఫ్యాక్టరీ ఓపెనింగ్​, మహిళా సంఘాలకు పావలా వడ్డీ, రైతు రుణ మాఫీ, ఉచిత ఎరువులు.. ఇలా వందల హామీలు ఇచ్చి ప్రజలకు వెన్ను పోటు పొడిచిన నయవంచకుడు కేసీఆర్​ అని కిషన్‌ రెడ్డి విమర్శించారు.

అంతేకాకుండా.. ‘ఆయన చెప్పే మాటలకు.. చేసే చేతలకు.. వళ్లించే చిలుకపలుకులకు పొంతన లేదు. ఎన్నికల హామీలు.. నీటి మూటలే తప్ప.. ఎందులోనూ చిత్త శుద్ది లేదు. అప్పులు పెంచారు, అవినీతి పెంచారు, అహంకారం పెంచుకున్నారు తప్ప.. రాష్ట్ర సంపద పెంచలేదు. బెస్ట్​ ఎకనమికల్​ పాలసీ అని కేసీఆర్​ అంటున్నాడు… అది బెస్ట్​ కాదు.. వరెస్ట్​ ఎకనామికల్​ పాలసీ. పవర్​ పాలసీ బెస్ట్​ పాలసీ అని అన్నడు.. అది బెస్ట్​ కాదు.. డేంజర్​ పవర్​ పాలసీ. రూ.45 వేల కోట్ల అప్పులతో డిస్కంలు, విద్యుత్​ వ్యవస్థ కుప్పుకూలిపోయే స్థితిలో ఉన్నది. బెస్ట్​ డ్రింకింగ్​ వాటర్​ పాలసీ అట.. అది బెస్ట్​ డ్రింకింగ్​ వాటర్​ పాలసీ కాదు.. బెస్ట్​ లిక్కర్​ డ్రింకింగ్​ పాలసీ. బెస్ట్​ ఇరిగేషన్​ పాలసీ.. అన్నడు.. అది బెస్ట్​ కమిషన్​ ఇరిగేషన్​ పాలసీ. అత్యుత్తమ దళిత పాలసీ అని కేసీఆర్​ అంటున్నాడు.. కానీ కేసీఆర్​ బెస్ట్​ కరప్షన్​ ఫ్యామిలీ పాలసీ, చీటింగ్​ పాలసీ అమలుచేస్తున్నాడు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. కొత్తవి ఇస్తున్నారు.

కేసీఆర్​ సకల జనుల ద్రోహి… ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల చెవుల్లో గులాబీ పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్​ పాలన చూశాం. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. 2014, 2018, అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్​ ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో కేసీఆర్​ బయట పెట్టి మాట్లాడాలి. 24 జిల్లా కేంద్రాల్లో నిమ్స్​ స్థాయిలో 24 హాస్పిటల్స్​ కడుతామని హామీ ఇచ్చి ఒక్కటి కూడా కట్టలేదు. 3 ఎకరాల సాగు భూమి, దళితులకు 50 వేల కోట్ల ప్రత్యేక నిధులు, సబ్​ ప్లాన్​ నిధులు దారిమళ్లించకుండా చూడటం, మహిళా బ్యాంకులు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, జర్నలిస్టులకు హెల్త్​ కార్డులకు… జర్నలిస్టుల సంక్షేమ నిధి, జర్నలిస్టుల భవనం… లాంటి ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదు. ప్రవాస భారతీయ విధానం తెస్తామన్నారు..

10 ఏండ్లు అయినా కాలేదు. మూతపడ్డ కంపెనీలు ఓపెన్​ చేస్తామని ఒక్కటీ ఓపెన్​ చేయలేదు. హైదరాబాద్​ నుంచి వరంగల్​కు ఇండస్ట్రియల్​ కారిడార్​ అన్నరు.. అది ఎక్కడ పోయింది? ప్రతి ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ..ప్రతి గ్రామంలో ఇంటర్నెట్.. రోడ్లు ఇస్తమన్నారు ఏమైంది? కేంద్రం ఇచ్చే నిధులు తప్ప గ్రామాలకు రాష్ట్రం నిధులు ఇవ్వడం లేదు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని, పునరుజ్జీవనం చేస్తామన్నారు.. ఏదీ లేదు.. కార్పొరేషన్​ చేసి వదిలేశారు. ఎంఎంటీఎస్​ సెకండ్​ ఫేజ్​ పై నిర్లక్ష్యం చేశారు. హైదరాబాద్​ ఉత్తరాన ఎయిర్​పోర్ట్​ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తది అటుంచితే.. వరంగల్​ ఎయిర్​పోర్టుకు ల్యాండ్​ ఇవ్వమంటే ఇస్తలేరు. ఆకాశ హర్మాలు.. గ్రాఫిక్స్​చూపెట్టి ప్రజలను మభ్యపెట్టిన పార్టీ బీఆర్​ఎస్​. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 80 వేల పుస్తకాలు చదివిన జ్ఞానంతో అప్పులపాలు చేసి భ్రష్టు పట్టించిన వ్యక్తి కేసీఆర్​. ఎఫ్​ఆర్​బీఎం నుంచి తప్పించుకోవడానికి మూసీకి ఒక కార్పొరేషన్​, రోడ్లకు ఒక కార్పొరేషన్​.. హుస్సేన్​ సాగర్​కు ఒక కార్పొరేషన్​.., వాటర్​కు ఒక కార్పొరేషన్​, కాళేశ్వరంకు ఒక కార్పొరేషన్​.. ఇలా లెక్కలేనన్ని కార్పొరేషన్లు వేస్తున్నారు.

అనేక కార్పొరేషన్లు పెట్టి నాబార్డు, బ్యాంకుల్లో విచ్చలవిడిగా అప్పులు చేశారు. ఇవన్నీ ప్రజలకు చెప్పకుండా.. తెలంగాణను ఉద్దరిస్తామని మళ్లీ మేనిఫెస్టో చెబుతున్నారు. రాష్ట్ర ఆదాయంలో 20 శాతం వడ్డీలకే పోతుంది. ఫీజు రీయింబర్స్​మెంట్​, ఆరోగ్యశ్రీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. తెలంగాణ ప్రజలను ఒకటే కోరుతున్నా.. కేసీఆర్​ చెప్పేవి.. కళ్లిబొల్లి మాటలు.. వీరు చెప్పేవి అన్ని అబద్ధాలు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలది ప్రజలను మోసం చేసే చరిత్ర వీటిని ప్రజలు గమనించాలి. ప్రభుత్వ చేతగానితనంతో, పరీక్షలు నిర్వహించే సామర్థ్యం లేక.. నోటిఫికేషన్లు వాయిదా పడుతుంటే.. దిక్కుతోచని స్థితిలో నిరుద్యోగులు ​ఆందోళనలో ఉన్నారు. 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్​.. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అందుకే కేసీఆర్​ మాటలను ఇప్పుడు చదువుకున్నవారే కాదు.. చదువు రాని వారు కూడా నమ్మే పరిస్థితి లేదు. 90 లక్షల మందికి మేలు చేస్తామంటే.. ప్రజలు నమ్మరు. పెట్రోల్​ మీద కేంద్రం తమకు వచ్చే ఆదాయం తగ్గించుకొని ట్యాక్స్​ తగ్గిస్తే… అన్ని రాష్ట్రాలూ కేంద్రంతో కలిసి అవి కొంత ట్యాక్స్​ తగ్గించాయి. ట్యాక్స్​ తగ్గించన ఏకైక రాష్ట్రం తెలంగాణ. మహిళా సంఘాలకు పావలా వడ్డీ.. తొమ్మిదేండ్లుగా ఇవ్వడం లేదు. ఉజ్వల లబ్ధిదారులకు కేంద్రం 500 రూపాలయ ధర తగ్గించారు.’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.