
కరీంనగర్ ప్రజలు రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ఈ సభకు మంత్రి కేటీఆర్ హజరవుతారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇవాళ ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఫోటోతో ఎలక్షన్లకు వెళ్తున్నామని, తొమ్మిదో తారీఖున నామినేషన్ పదో తారీఖున రెండో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీకి స్థానం లేదని, తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌ని తీర్చిదిద్దుతామన్నారు మంత్రి గంగుల.
హుజురాబాద్ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ గతంలో కాంగ్రెస్ తో కుమ్మక్కై గెలుపొందారన్నారు.
2018 ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్రలు పన్నారని ఈటల రాజేందర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈటలది దుర్మార్గాపు ఆలోచన అని మండిపడ్డారు మంత్రి గంగుల. సీఎం కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ మాకు పవిత్ర గ్రంథంతో సమానమని, కేసీఆర్ ఫోటోతో గెలిచి… ఏళ్ళ తరబడి పదవులు అనుభవించిన ఈటల… ఇప్పుడు కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యపట్టారు. కేసీఆర్ లేని తెలంగాణ ఊహించుకోలేమన్నారు. మనం తప్పు చేస్తే భవిష్యత్ తరాలు అంధకారమవుతాయని హెచ్చరించారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టి మన సంపద దోచుకెళ్లాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీలపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ ఎస్ పార్టీ 90కి పైగా సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.కాంగ్రెస్ హామీలకే పరిమితమని, కర్నాటకలో ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయన్నారు. 45 రోజులు తన కోసం పనిచేస్తే 5 ఏళ్లు మీకోసం పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నానన్నారు.