
Big Breaking: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్‌ను ఆదివారం ఎత్తివేసింది. మహమ్మద్ ప్రవక్తను అవమానించేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసినందుకు గాను రాజాసింగ్‌ను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఆగస్ట్ 23, 2022న బీజేపీ నాయకత్వం రాజా సింగ్‌ను సస్పెండ్ చేసింది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకత్వాన్ని కోరారు. ఈ విషయమై జాతీయ నాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం చర్చలు జరిపింది. బీజేపీ నేత విజయశాంతి రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. రాజాసింగ్ కూడా ఈసారి బీజేపీ టిక్కెట్టు కేటాయించకుంటే పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. ఏ క్షణమైనా బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. తొలి జాబితాలో రాజాసింగ్ కు చోటు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ క్రమశిక్షణా సంఘం ఇవాళ వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 10న బీజేపీ నాయకత్వం పంపిన షోకాజ్ నోటీసుకు రాజా సింగ్ సమాధానమిచ్చారు. ఈ సమాధానంతో తాను సంతృప్తి చెందానని బీజేపీ క్రమశిక్షణా సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు బీజేపీ తొలి జాబితా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. జాబితా విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి…అధికారికంగా ఇప్పటి వరకు పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. ప్రస్తుత ప్రచారం ప్రకారం కరీంనగర్ నుంచి బండి సంజయ్, ధర్మపురి నుంచి కోరుట్ల అరవింద్ పోటీ చేస్తారని తెలుస్తోంది. హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ ఈటల రాజేందర్ పోటీ చేస్తారని సమాచారం