
Harish Rao: తెలంగాణ వ్యాప్తంగా దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయదశమి రోజు పాలపిట్టను చూడటం, రావణ దహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్రంలో ప్రతీ ఊరిలో ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. ఇక మంత్రి హరీష్ రావు ఇలాకా సిద్దిపేటలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం రావణ దహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట కల నెరవేరిందని అన్నారు. దసరా పండుగ లోపు సిద్దిపేటకి రైలు తెస్తాను అని గత దసరా రోజున చెప్పానన్నారు. ఈ దసరా లోపు సిద్దిపేటకి రైలు తెచ్చి దశాబ్దాల కల నిజం చేసుకున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ వచ్చిన తర్వాత సిద్దిపేట జిల్లా అయ్యింది, సిద్దిపేటకి రైలు వచ్చింది, సిద్దిపేటకి గోదావరి జలాలు వచ్చాయని ఆయన తెలిపారు. పవిత్రమైన పాలపిట్ట సాక్షిగా తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్ కి రుణపడి ఉండాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు చెప్పారు.