Telangana Elections 2023: దసరా తర్వాతే కాంగ్రెస్ రెండో జాబితా.. సీపీఐ, సీపీఎంలతో పొత్తుపై లైన్ క్లియర్!

Congress to announce Second List after Dussehra: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే 55 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. దసరా పండగ తర్వాత రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇంకా 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అక్టోబర్ 25 లేదా 26 తేదీలలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఆ తర్వాతే జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది.
రెండో జాబితాపై ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి చేసింది. అభ్యర్ధులతో కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడనున్నట్టు సమాచారం తెలుస్తోంది. మరోవైపు సీట్ల కేటాయింపులో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీలు సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు స్థానాలు ఇచ్చేందకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. చెన్నూరు నుంచి సీపీఐ అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే సీపీఐ అనుబందం సంఘం ఎఐటీయూసీ.. చెన్నూరులో సీపీఐ పోటీ చేయడంపై వ్యతిరేకత చూపిస్తోంది.