
Vijaya Milk: ఇక నుంచి జంట నగరాల్లో కృష్ణా యూనియన్ పాల ఉత్పత్తులు లభ్యం కానున్నాయి. స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను విజయ బ్రాండ్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆరు దశాబ్దాలుగా వినియోగదారులు విశ్వాసం చూరగొంటున్న కృష్ణ మిల్క్ యూనియన్ వారి విజయ పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో లభ్యం కానున్నాయి. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తన చేతుల మీదుగా కృష్ణా మిల్క్ యూనియన్ వారి విజయ పాలు, పాల ఉత్పత్తులను ఆవిష్కరించి, తదనంతరం హైదరాబాద్ మార్కెట్‌కు విడుదల చేశారు. శంషాబాద్‌లోని జీయర్ స్వామి వారి ఆశ్రమంలో నేడు(అక్టోబర్ 24) విజయ పాల ఉత్పత్తులను ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భముగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. పాడి పశువుల పెంపకం పవిత్ర వృత్తి అని, అటువంటి పాడి పశువుల పెంపకం చేపడుతున్న పాడి రైతులకు కృష్ణా మిల్క్ యూనియన్ దేశంలోనే అధిక ధర, బోనస్, పాడి రైతు, పశు సంక్షేమ కార్యక్రమములను అందిస్తూ ప్రోత్సహించడం అభినందనీయమని తెలిపారు. అంతే కాకుండా కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్‌గా చలసాని ఆంజనేయులు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి రోజు గ్రామాలను సందర్శిస్తూ.. పాడి రైతులతో మమేకమవుతూ, అనునిత్యము పాడి రైతుల సంక్షేమం కోసం పరితపిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయటం హర్షనీయమని తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తులు నాణ్యతకు మారు పేరు అని, అలాంటి ఉత్పత్తులను హైదరాబాద్ ప్రజలకు అందించాలనే సంకల్పం గొప్పదని, ఈ ప్రయత్నంలో కృష్ణా మిల్క్ యూనియన్ విజయం సాధించి, తద్వారా హైదరాబాద్ ప్రజలు, కృష్ణా మిల్క్ యూనియన్ లబ్ధి పొందాలని చిన్న జీయర్ స్వామి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. భవిష్యత్తులో కృష్ణా మిల్క్ యూనియన్ పాలు, పాల ఉత్పత్తులు కృష్ణా నది పరివాహక ప్రాంతమంతా విస్తరించాలని అభిలాషించారు.
ఈ సందర్భముగా కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ.. మన గ్రామాలు, మన రైతులు, మన పాలు, మన వినియోగదారులు, మన సంస్థ అనే లక్ష్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ ప్రయాణం చేస్తుందని, మరియు నాణ్యతలో రాజీ లేకుండా కృష్ణా మిల్క్ యూనియన్ ఆరు దశబ్ధాలుగా వినియోగదారులకు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను అందజేస్తుందని తెలిపారు. సమితికి పాడి రైతులు, వినియోగదారులు రెండు కన్నులని అహర్నిశలు వారి అభివృద్దికి, సంక్షేమముకు సమితి కృషి చేస్తుందని తెలిపారు. అత్యంత స్వచ్చత, నాణ్యత కలిగిన కృష్ణా మిల్క్ యూనియన్ విజయ పాలు, పాల ఉత్పత్తులను హైదరాబాదు వాసులకు కృష్ణా మిల్క్ యూనియన్ రేపటి నుంచి అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వర బాబు, పాలక వర్గ సభ్యులు దాసరి వెంకట బాల వర్ధన రావు, ఉయ్యూరు అంజి రెడ్డి, అర్జావెంకట నగేష్, చలసాని చక్రపాణి, బొట్టు రామచంద్ర రావు, డీజీఎం సేల్స్ డి.లక్ష్మణ్, సేల్స్ మేనేజర్ డి.సుబాష్, లింగస్వామి, సీ&ఎఫ్ ఏజెంట్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.