
31వ తేదీన కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజా భేరి బహిరంగ సభ ఉంటుందన్నారు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 31న సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా ప్రియాంక గాంధీ కొల్లాపూర్ వెళ్తారని, వచ్చే నెల మొదటి వారంలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రెండవ విడత బస్సు యాత్ర లో పాల్గొంటారని మహేశ్ గౌడ్ తెలిపారు. అంతేకాకుండా.. ఈ నెల 26, 27 తేదీలో ఆరు గ్యారంటీ స్కీమ్స్ పై ఇంచార్జ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు పర్యటిస్తారన్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు విస్తున్నాయన్నారు. అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నెల 28 నుండి రెండవ విడత బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, త్వరలోనే పూర్తిస్తాయి షెడ్యూల్ వస్తుందన్నారు మహేశ్ కుమార్ గౌడ్. లక్ష కోట్లు తీసుకెళ్లి కాళేశ్వరం లో పెట్టారని, హరీష్ రావు, కేటీఆర్, కవిత దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. రేపు సీఈసీ సమావేశం ఉందని, అభ్యర్థుల ఎంపిక పై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. నిజామాబాద్ అర్బన్ టిక్కెట్ ఎవరికి కేటాయించాలి అనేది స్క్రీనింగ్ కమిటీ చూసుకుంటుందని, సీఈసీ నిర్ణయం ఫైనల్ అన్నారు మహేశ్ కుమార్ గౌడ్. రెండవ విడతలో బలమైన అభ్యర్థులందరికీ టికెట్లు వస్తాయని, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ స్థానాలు మైనారిటీ లు అడుగుతున్నారన్నారు. మైనారిటీ లు కాంగ్రెస్ వైపు ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు న్యాయం చేస్తుందన్నారు.