
Snake in Car: సాధారణంగా వర్షాకాలంలో పాములు తమ ఆవాసాలను వదిలి.. జనావాసాల్లోకి వెళ్తుంటాయి. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇళ్లల్లోకి, బైకుల్లో, కారు ఇంజిన్‌లలో, బస్సుల్లో ఎక్కడపడితే, అక్కడ పాములు కనిపిస్తుంటాయి. వీటి వల్ల జనాలు తీవ్రంగా భయబ్రాంతులకు గురి అవుతారు. అయితే, సేమ్ ఇలాంటి ఘటన ఒకటి నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. కారు డ్రైవింగ్ సీటుకు వెనుక ఉండే కవర్‌లో పాము ప్రత్యక్షమైంది. సెల్‌ఫోన్ కోసం చేయి పెట్టిన మహిళ చేతిపై పాము కాటేసింది.
అసలేం జరిగిందంటే.. ఖలీల్, అఫ్రీన్ దంపతులు దసరా సెలవులకు పిల్లలతో కలిసి నాగర్‌కర్నూల్ రాచాలపల్లి గ్రామానికి వెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి కుటుంబంతో కలిసి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఇంటివద్ద కారు దిగే సమయంలో సీటు కవర్‌లో పెట్టిన ఫోన్‌ను తీసుకోవడానికి అఫ్రీన్ చేయి పెట్టగా.. సెల్‌ఫోన్‌కు బదులు నాగుపాము వచ్చింది. ఆమె భయంతో పామును కదపడంతో.. అప్పటికే ఆమె బొటనవేలుపై కాటేసింది. స్థానికులు పామును బయటకు తీసి చంపేశారు. బాధితురాలిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ప్రాణాపాయం తప్పింది కానీ రెండు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు వెల్లడించారు. ఆ పాము సీటు కవర్‌లోకి ఎలా వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది.