
Union Minister Amit Shah’s Adress Meeting in Suryapet Today: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దాంతో దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో పాలన కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణలో కూడా విజయం సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు రాష్ట్రంలో తరచుగా పర్యటిస్తున్నారు. నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
మంత్రి అమిత్ షా సూర్యాపేటలో బహిరంగ సభను ముగించుకుని సాయంత్రం 5.45 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఈ బహిరంగ సభకు ముందే తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహిస్తారని సమాచారం. ఈ పర్యటన కోసం అమిత్ షా గురువారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో ఆయన బస చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు 75వ బ్యాచ్ పోలీసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు.
సీనియర్ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ సభ జరుగుతుండడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ఏం మాట్లాడతారనే దానిపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. సూర్యాపేట బహిరంగ సభకు రాములమ్మ (విజయ శాంతి) హాజరవుతారా? లేదా అని కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే విజయ శాంతి గత కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.