
Chalamala Krishna Reddy will contest as an independent candidate: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం ఎన్నో చర్చల అనంతరం రెండో విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం విడుదల చేసింది. మొదటి విడతలో 55 మందితో కూడిన జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. రెండో విడతలో 45 సీట్లను రిలీజ్ చేసింది. దాంతో ఇప్పటివరకు మొత్తం 100 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. తెలంగాణలో 119 సీట్లకు ఇంకా 15 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 4 సీట్లు సీపీఐ, సీపీఎంలకు కేటాయించిన విషయం తెలిసిందే.
అయితే రెండో విడత అభ్యర్థుల ప్రకటన అనంతరం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. బీజేపీలోకి వెళ్లి మళ్లీ సొంతగూటికే వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రెండో విడతలో టికెట్ కేటాయించడంతో.. కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఆయన తిరుగుబాటుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా చలమల కృష్ణారెడ్డి బరిలోకి దిగాలని చూస్తున్నారట.
చలమల కృష్ణారెడ్డి గత ఏడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేశారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. అప్పటినుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ 14 నెలలుగా నియోజకవర్గంలో చలమల కృష్ణారెడ్డి విస్తృత ప్రచారం చేశారు. చివరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు దక్కడంతో కృష్ణారెడ్డికి భారీ షాక్ తగిలింది. దాంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట. ఈరోజు మధ్యాహ్నం తన అనుచరులతో సమావేశం అనంతరం నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. మరి చలమల కృష్ణారెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.