
Kadiyam Srihari: తనకు బీఫాం ఇచ్చి ఆశీర్వదించి సీఎం పంపించారని బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. తన రాజకీయ జీవితం నియోజకవర్గానికి కేటాయించానని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ను గ్రామాలలో నిలదీయాలన్నారు. మంత్రి హరీష్ రావును కేసీఆర్‌కు రామబాణం అని అభివర్ణించారు.
కేసీఆర్ బ్రహ్మాండమైన మేనిఫెస్టోను విడుదల చేశారని .. కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకుని మద్దతు తెలుపాలని ప్రజలకు సూచించారు. తనకు భేషజాలు లేవన్న కడియం శ్రీహరి.. రాజయ్య సహాయంతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజయ్య ఏమి మనసులో పెట్టుకోకు అని కోరుతున్నానని.. భవిష్యత్‌లో ఆయనకు మంచి పదవి వస్తుందని ఆశిస్తున్నానని కడియం పేర్కొన్నారు. మనిద్దరం జోడెద్దుల లాగా పని చేద్దామని ఆయన రాజయ్యతో అన్నారు. తాను అవినీతి చేయనని, భూ కబ్జాలు చేయనని, పోలీస్ స్టేషన్‌లలో కేసులు పెట్టివ్వను అని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో 6 వేల ఇండ్లు మంజూరు చేయిస్తానని కడియం వెల్లడించారు. 2100 దళిత బంధు యూనిట్లు వస్తాయన్నారు. తాను రాజయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి దళిత బంధు, ఇండ్లు మంజూరు గురించి చర్చిస్తానని హామీ ఇచ్చారు.