Leading News Portal in Telugu

Minister KTR : కేసీఆర్‌ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారు


Minister KTR : కేసీఆర్‌ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారు

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తొడలు కొట్టి భుజాలు ఎగిరేసిన వాళ్లు కేసీఆర్ వస్తుండడంతో ముఖం చాటేశారన్నారు. కేసీఆర్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారని, కేసీఆర్ లాంటి నాయకుడిని రాష్ట్ర ప్రజలు మన బిడ్డ అనుకుంటూ ఆదరిస్తున్నారన్నారు. కేసీఆర్ కామారెడ్డి ని ఎంచుకోవడం కామారెడ్డి నియోజకవర్గ ప్రజల అదృష్టమని, కామారెడ్డి నియోజకవర్గ ప్రజల దశలు మార్చేందుకు కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరిక మేరకే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, కామారెడ్డి కి కేసీఆర్ వస్తుండడంతో ప్రతిపక్షాలు భూములు గుంజుకోవడానికి అని తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.

అంతేకాకుండా.. ‘కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. కొడంగల్లో గెలవలేని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలుస్తాడా. కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేస్తాం. కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారు… కానీ 50 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశారు. కాంగ్రెస్, బీజేపీల పంచాయతీలు ఢిల్లీలో జరుగుతాయి. అలాంటి నాయకులు మనకు అవసరమా. రాష్ట్రం మొత్తం కామారెడ్డి నియోజకవర్గం వైపు చూస్తుంది. నవంబర్ 9న సీఎం కేసీఆర్ నామినేషన్ వేస్తారు. కామారెడ్డి దెబ్బ, సత్తా రేవంత్ రెడ్డికి చూపించాలి. ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి కంటే షబ్బీర్ అలీ నయం. రాష్ట్రం లో నెంబర్ వన్ నియోజకవర్గం రూపురేఖలు మారుతాయి. మాస్టర్ ప్లాన్ కొత్త ప్రతిపాదన లేదు.

కామారెడ్డి ప్రాంతంలో భూములు అమ్ముకోవద్దు. మూడో సారి కేసీఆర్ గెలువగానే అసెన్ భూములు హక్కులు కల్పిస్తాం. కామారెడ్డి కేసీఆర్ వస్తే చుట్టూ పక్కల నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుంది. ప్రతిదాంట్లో చిల్లర రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ అమ్మగారి ఊరు కొనాపూర్ (మాశానిపల్లి)లో వందలాది ఎకరాలు ఉండేది. తల్లీ గారు ఊరు అభివృద్ధి కోసం కేసీఆర్ వస్తున్నారు తప్ప భూములు లాకోడానికి కాదు. గజ్వేల్ లో అభివృద్ధి చేశారు. కేసీఆర్ నామినేషన్ రోజు ప్రతి ఇంటి నుంచి ఒక్కరు రావాలి.’ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.