
నిర్మల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మద్దతుగా పాక్ పట్ల, గాంధీనగర్, పోచం పహాడ్, మాదాపూర్ గ్రామాల రైతులు నిలిచారు. స్వచ్చందంగా రెండు లక్షల పదహారు రూపాయాల విరాళం చెక్కును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అందజేశారు. పాక్ పట్ల నుంచి క్యాంప్ కార్యాలయం వరకు భారీగా 25 ట్రాక్టర్లలో ర్యాలీగా తరలివచ్చారు. పాక్ పట్లలో ఆయిల్ పామ్ ప్యాక్టరీ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా నామినేషన్ ఖర్చు కోసం ఈ చెక్కును అందజేసినట్లు రైతులు తెలిపారు. విరాళం ఇచ్చిన రైతులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో రైతు గోసలు పోయాయని అన్నారు. రైతు బంధు, రైతు భీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, పుష్కలంగా సాగు నీరు అందించి రైతును రాజుగా చేసిన బీఆర్ఎస్ కు అండగా నిలవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల గురించి పట్టించుకున్న వారు లేరని, వారికి రైతు సంక్షేమం పట్టదన్నారు. కర్నాటకలో కేవలం 5 గంటల కరెంట్ ఇస్తూ… రైతులకు ఎదో చేశామని కర్నాటక ఉప ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి ఉందని వివరించారు. కేసీఆర్ భరోసా పేరుతో రైతుబంధు, ఆసరా పింఛన్లతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను కోనసాగిస్తామని చెప్పారు. ఎన్నికలు కాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని భరోసానిచ్చారు.