
IT Notes:బాలాపూర్‌లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఆశించిన బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతనర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే పారిజాతనర్సింహారెడ్డి ఇంట్లో ఇవాళ సోదాలు ముగిసాయి. మేయర్ పారిజాత ఇంట్లో నుండి 8 లక్షల రూపాయల నగదు సీజ్ చేశారు. కొన్ని డాక్యుమెంట్లు ఐటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కాగా.. పారిజాత,నర్సింహారెడ్డి ఇద్దరికి ఇన్‌కంట్యాక్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నవంబర్ 6న ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఆమె తిరుపతిలో ఉండగా.. ఆమె భర్త నరసింహారెడ్డి న్యూఢిల్లీలో ఉన్నారు. తిరుపతి నుంచి చెన్నై మీదుగా నిన్న రాత్రి పారిజాతాన్ని ఐటీ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చారు. పారిజాత హైదరాబాద్ రాగానే ఆమె భర్త నరసింహారెడ్డి కూడా న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. పారిజాత నరసింహారెడ్డి ఆదాయం, వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. ఐటీ అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు పారిజాత నరసింహారెడ్డి మీడియాకు తెలిపారు.
ఎన్నికల బరిలో నిలిస్తే ప్రత్యర్థులకు నష్టం వాటిల్లుతుందన్న భయంతోనే ఐటీ దాడులు చేశారని పారిజాత నరసింహారెడ్డి విమర్శించారు. మరోవైపు కిచ్చెన్నగారిలోని లక్ష్మారెడ్డి నివాసంలో ఇవాళ తెల్లవారుజాము వరకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పారిజాత నరసింహారెడ్డి, కేఎల్‌ఆర్ నివాసాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఐటీ అధికారులు స్పష్టత ఇవ్వాలి. కాగా.. ఐటీ సోదాలపై కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా స్పందించారు. బీఆర్‌ఎస్‌కు సహకరించాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఐటీ సోదాలు చేస్తోందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఐటీ సోదాలకు భయపడేది లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అన్నారు. కాగా, ఐటీ సోదాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కేఎల్‌ఆర్ నివాసంలో రెండోరోజు ఐటీ సోదాలు..
ఇవాళ నార్సింగ్‌లోని కేఎల్‌ఆర్ నివాసంలో రెండోరోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రాత్రి 1 గంట వరకు ఐటీ బృందం సోదాలు చేసింది. ఇంట్లో దొరికిన పత్రాలను అధికారులు తీసుకెళ్లారు. మరో 15 మంది అధికారులతో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లోని కేఎల్‌ఆర్ ప్రధాన కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి ఫామ్‌హౌస్‌లో సోదాలు ముగియడంతో, అధికారులు ప్రకటనను నర్సింగ్‌హోమ్‌కు తీసుకువచ్చారు. మరోసారి ఐటీ అధికారులు 5 వాహనాల్లో లక్ష్మారెడ్డి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది.
మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు..
మరోవైపు ఇవాళ ఉదయం నుంచి మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విస్పర్ వ్యాలీ విల్లాలోని రఘువీరారెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. జానారెడ్డి మరో కుమారుడు జయవీర్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించింది. నాగార్జునసాగర్ నుంచి జయవీర్ బరిలో నిలిచారు. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ కోసం రఘువీర్ దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నేతలకు చెందిన 18 చోట్ల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Gadikota Srikanth Reddy: నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటినే జిల్లా కేంద్రం..