
వేలం పాట మాదిరిగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారన్నారు రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా కే.లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో సంక్షేమ పథకాల అమలులో ఆంక్షలు పెడుతున్నారని, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే మేలు అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారన్నారు లక్ష్మణ్. ఉచిత హామీలతో మోసపోయామని కర్ణాటక ప్రజలు గుర్తించారని, కర్ణాటకలో నాణ్యమైన కరెంట్ రెండు గంటలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు.
అంతేకాకుండా.. ‘నాడు కర్ణాటక బీజేపీ ప్రభుత్వం 12 గంటల విద్యుత్ ఇచ్చాం. రైతులకు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కరెంట్ చార్జీలు పెంచారు… వెయ్యి రూపాయలు వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు మూడు వేలకు పెంచారు. అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే కాంగ్రెస్ మాట మార్చింది. కర్ణాటక లో 65 యేళ్లు దాటిన వారికే వృధ్యాప్య పింఛన్లు ఇస్తున్నారు. చేయూత పథకాల పేరుతో చెయ్యి ఇస్తారు జాగ్రత్త. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హామీలకు మోసపోవద్దు. ఈ నెల7న మోడీ సభను విజయవంతం చేయాలని పిలుపు. ఉచిత పథకాలపై లక్ష్మణ్ కామెంట్. కూర్చొని తింటే కొండలు అయినా కరిగిపోతాయి.. జనసేన ఎన్డీఏ భాగస్వామి.. జనసేన తో పొత్తు ఖరారు అయ్యింది.. రెండు రాష్ట్రాల్లో జనసేనతో కలిసిపోతాం.’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.