
Mallikarjuna Kharge: కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో కాంగ్రెస్ బహిరంగసభ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జయ భేరి సభకు అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణా వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాక్రే హాజరయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అంతా ఒక్కటేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రధాని మోడీ, కేసీఆర్లు దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదల బ్రతుకులు మారుతాయన్నారు.
ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్నో ధర్నాలు నడిపినా చివరికి తెలంగాణ ప్రజల ఆశ తీర్చింది సోనియా గాంధీనే, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని ఖర్గే చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల ఇమేజ్ను దెబ్బ తీయడానికి ఈడీ, ఐటీ దాడులు చేయిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. మోడీ, కేసీఆర్ కలిసి కాంగ్రెస్ను ఓడించాలని చూస్తున్నారని.. కానీ హస్తం పార్టీ అంతకు అంత పుంజుకుంటుందన్నారు. మోడీ, బీజేపీలు అసత్యాలు ప్రచారం చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, ఇచ్చారా అని అడుగుతున్నామన్నారు.
రాష్ట్రం విడిపోయినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు ప్రతి వ్యక్తిపైన 5లక్షల అప్పు చేసి పెట్టిందన్నారు. వీళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడ అని అడుగుతున్నామని.. కాళేశ్వరం పేరుతో వేల కోట్లు కొట్టేసి కేసీఆర్ కుటుంబం దాచుకుంటుంది కానీ, నాణ్యమైన ప్రాజెక్టులు కట్టలేక పోతుందని విమర్శలు గుప్పించారు. పలు ప్రాజెక్టులు నాణ్యత లేక కుంగి పోతున్నాయని.. ఇలాంటి నాణ్యత లేని ప్రభుత్వం మనకు వద్దన్నారు.