Amit Shah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ తన స్పీడ్ పెంచింది. తెలంగాణ కోసం బీజేపీ అగ్రనేతలు క్యూ కడతారని ప్రచారం జరుగుతోంది. అగ్రనేతల వరుస పర్యటనలతో కూడిన ప్రచార కార్యక్రమాన్ని బీజేపీ నేటి నుంచి ప్లాన్ చేసింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ మళ్లీ తెలంగాణకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం 12.35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి 1 గంటకు జనగామలో జరిగే పబ్లిక్ మీటింగ్‌కి హాజరవుతారు.
అక్కడి నుంచి 2.45 గంటలకు కోరుట్ల చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నుంచి 3.40 వరకు సభలోనే ఉంటారు. కోరుట్ల నుంచి 4.45 గంటలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఉప్పల్ లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షో ముగిశాక రాత్రి 8.10 గంటలకు ఢిల్లీకి పయనం అవుతారు. కాగా.. రెండు రోజుల క్రితం తెలంగాణకు వచ్చిన అమిత్ షా.. బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. సూర్యాపేట, వరంగల్ బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
మరో బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎల్లారెడ్డి, కొల్లాపూర్ సభల్లో గడ్కరీ ప్రసంగించనున్నారు. మరో బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. ముషీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి తరపున పడ్నవీస్ రోడ్ షోలో పాల్గొననున్నారు. అలాగే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పీయూష్ గోయల్ ఈ నెల 21న తెలంగాణకు వస్తున్నారు. రెండు సభల్లో కూడా పాల్గొంటాడు. మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణలో పర్యటన ఖరారైంది.
ఈ నెల 24, 25, 26 తేదీల్లో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ నెల 25, 26 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. హుజూరాబాద్, మహేశ్వరం సభల్లో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు అస్సాం సీఎం, గోవా సీఎంలు కూడా వచ్చే వారం తెలంగాణకు ఎన్నికల ప్రచారానికి రానున్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారాన్ని కూడా మోడీతోనే ముగించాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకోసం వచ్చేవారం మళ్లీ మోడీ తెలంగాణకు వస్తారని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ అగ్రనేతల రాకతో తెలంగాణలో నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది.
Uttarkashi Tunnel: బిక్కు బిక్కుమంటు 9 రోజులుగా సొరంగంలోనే 41మంది.. రెస్క్యూ ఆపరేషన్‌లో అడ్డంకులు