Leading News Portal in Telugu

Minister KTR: కేసీఆర్ రాజకీయ జీవితంతో బీజేపీతో ఏనాడు పొత్తు పెట్టుకోలేదు..



Ktr

Minister KTR: ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు జేబీఎస్ నుంచి తూంకుంట వరకు స్కై వేలు ఏర్పాటు చేయాలని చూస్తున్నామని, అయితే కేంద్ర మంత్రులను కలిసి రక్షణశాఖ భూములను ఇవ్వాలని కోరితే, అందుకు అంగీకరించలేదని చెప్పారు. వచ్చే ప్రభుత్వంలో ఈ స్కైవేలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

కేంద్రం ఇష్టం వచ్చినట్లు గ్యాస్ సిలిండర్ల ధరల్ని పెంచిందని, ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 1200 ఉంటే మేము రూ. 800 తగ్గించి రూ.400లకే సిలిండర్ అందిస్తామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరిందనడం అవాస్తవమని అన్నారు. పేపర్ లీకేజీపై ఎక్కడా లేని రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. లక్షా 63 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది కేవలం తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పారు. కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని ప్రక్షాళన చేస్తామని అన్నారు.

Read Also: No Non-veg Day: రేపు యూపీలో “నో నాన్ వెజ్”.. అన్ని మాంసం దుకాణాలు బంద్..

తొమ్మిదేళ్ల కాలంలో నిబద్ధతతో పనిచేసి రాష్ట్ర సంపదనను పెంచామన్నారు. 45 ఏళ్ల కేసీఆర్ రాజకీయ జీవితంలో, బీఆర్ఎస్ 22 ఏళ్లలో ఏనాడూ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని చెప్పారు. ఏ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మేము బీజేపీతో కలిసి వెళ్లలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీనే కొన్ని చోట్ల బీజేపీకి సహకరించిందని విమర్శించారు. కొన్ని కేసుల్లో అరెస్ట్ చేయలేదు అంటే మేము బెయిల్ తెచ్చుకున్నాం కాబట్టే ఆగింది, మేము బీజేపీతో కలిసినట్లు కాదు, మేము ఏ పార్టీకి ఏ టీమ్, బీ టీమ్ కాదని, దేశంలో మార్పు రావాలని అన్నారు.

కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే మార్చిమార్చి అధికారాన్ని పంచుకుంటున్నాయని, దేశంలో మార్పు రావాలని అన్నారు. మేము ఇక్కడ గెలిచిన తర్వాత ఖచ్చితంగా మహారాష్ట్రలో కాలు పెడుతాం, ఖచ్చితంగా మహారాష్ట్రలో 10, 15 సీట్లు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో ఈ ఇద్దరే ఉండాలా..? మిగతా వాళ్లు ఉండకూడదా..? అని ప్రశ్నించారు. మేము ప్రస్తుతం ఎవరితో కలిసి లేమని అన్నారు.