
EC order for investigation on Padi Koushik Reddy Comments: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన మంగళవారం హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశారు. మీరు గెలిపిస్తే విజయయాత్ర.. లేకపోతే కుటుంబంతో సహా శవయాత్ర అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి.. నివేదిక అందించాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం తన భార్య, కూతురుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో కార్నర్ మీటింగ్‌లో ఓటర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మీకు దండం పెడతా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నాకు ఓటేసి గెలిపించండి. నేను చేయాల్సిన ప్రచారం చేశా.. ఇక సాదుకుంటరో, సంపుకుంటరో మీ ఇష్టం. ఓట్లేసి గెలిపిస్తే నాలుగో తారీఖున నేను విజయయాత్ర వస్తా.. లేకపోతే నా శవయాత్రకు మీరు రండి’ అంటూ కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలనే ఈసీ నివేదిక కోరింది.
పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల కోసం కౌశిక్ రెడ్డి తన భార్యాబిడ్డలతో కలిసి నిర్విరామంగా ప్రచారం చేశారు. కౌశిక్ రెడ్డి తరపున ఆయన కూతురు శ్రీనిక చేసిన ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ చేసిన ప్రజా ఆశీర్వాద సభలో శ్రీనిక చేసిన ప్రచారం బాగా వైరల్ అయ్యింది. హుజూరాబాద్ నియోజిక వర్గం నుంచి బీజేపీ తరపున ఈటల రాజేందర్ బరిలో ఉండటం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. గత ఉప ఎన్నికల్లో ఈటల మీద పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.