Leading News Portal in Telugu

Telangana Elections 2023: సెలవనుకుని బీరు తాగి పడుకునే వాళ్లందరూ.. లేచి వచ్చి ఓటు వేయండి!


Telangana Elections 2023: సెలవనుకుని బీరు తాగి పడుకునే వాళ్లందరూ.. లేచి వచ్చి ఓటు వేయండి!

Allu Aravind Cast His Vote: ఓటు వేయకుండా.. ప్రభుత్వాలను విమర్శించే హక్కు మనకు లేదని సినీ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. పోలింగ్ రోజును సెలవు అనుకుని పడుకునే వాళ్లందరూ లేచి వచ్చి ఓటు వేయండని కోరారు. అల్లు అరవింద్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్ 153లో తన ఓటును వేశారు.

పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చిన నిర్మాత అల్లు అరవింద్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మనకు ఈ ప్రభుత్వం ఏం ఇస్తుందనుకోవద్దు. హాలీడే కదా అని బీరు తాగి ఇంట్లో పడుకునే వారు చాలా మంది ఉన్నారు. అలా చేస్తే.. ఆ తర్వాత ఎమ్మెల్యేను ప్రశ్నించే హక్కు వారికి ఉండదు. అందరూ లేచి వచ్చి ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత’ అని అన్నారు.

ఇదే పోలింగ్ కేంద్రంలో ఉదయం సైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓటేశారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, హీరో అల్లు శిరీష్‌‌లు బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ (పోలింగ్‌ బూత్‌ 153) వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తమ కుటుంబసభ్యులతో కలిసి జూబ్లీక్లబ్‌లో ఓటు వేశారు. మెగాస్టార్ భార్య సురేఖ, కూతురు శ్రీజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.