Leading News Portal in Telugu

Telangana Elections 2023: తాండూరులో తీవ్ర ఉద్రిక్తత.. నర్సాపూర్ లో కార్లపై దాడుల పర్వం!


Telangana Elections 2023: తాండూరులో తీవ్ర ఉద్రిక్తత..  నర్సాపూర్ లో కార్లపై దాడుల పర్వం!

Congress vs BRS at Tandur: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు సజావుగానే సాగుతున్నా కొన్నిచోట్ల మాత్రం చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో సాయి పూర్ లోని పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాలా సేపు పోలింగ్ కేంద్రంలో రోహిత్ రెడ్డి ఉండడంతో కాంగ్రెస్ నాయకుల నినాదాలు మొదలు పెట్టారు, రోహిత్ రెడ్డి రిగ్గింగ్ పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఆ అనంతరం పోలింగ్ కేంద్రం బయట కాంగ్రెస్ నాయకుల ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులపై లాఠీ ఝుళిపించారు డీఎస్పీ శేఖర్ గౌడ్. బీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారని రోడ్డుపై కాంగ్రెస్ నాయకులు బైఠాయించారు.

Telangana Elections 2023: పోలింగ్ బూత్ ముందు తగలబడిన చెట్టు..ఆందోళనలో ఓటర్లు!

ఈ క్రమంలో పోలీసులు వారిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోపక్క మెదక్ జిల్లా నర్సాపూర్ లో కార్లపై దాడుల పర్వం చర్చనీయాంశం అయింది. పరస్పరం వాహనాలపై బీఆర్ఎస్ , కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగుతున్న అంశం హాట్ టాపిక్ అయింది. శివ్వంపేట మండలం భీమ్లా తండాలో కాంగ్రెస్ కార్యకర్త కారుపై దాడి జరిగింది, ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్త సుధీర్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఈ దాడి బీఆర్ఎస్ కార్యకర్తలే చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఇక మరో పక్క కాసేపటి క్రితమే నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి కుమారుడి కారుపై కొంత మంది వ్యక్తులు దాడి చేసిన అంశం కూడా తెర మీదకు వచ్చింది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ (మం) అడ్వాలపల్లి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. 244 ,245 పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలో గుంపుగా ఉన్న ఓటర్లను పోలీసులు అదుపు చేసే క్రమంలో ఓటర్ల పై లాఠీ ఝుళిపించారు పోలీసులు, ఈ క్రమంలో ముగ్గురికి గాయాలు కావడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఓటర్లు. దీంతో ఓటింగ్ కొద్దిసేపు ఆగింది.