Leading News Portal in Telugu

Auto Strike: రేపు ఆటో బంద్‌.. సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ర్యాలీ


Auto Strike: రేపు ఆటో బంద్‌.. సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ర్యాలీ

Auto Strike: టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పటి వరకు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే మహిళలు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ఎదురు చూస్తున్నారు. దీంతో బస్సుల్లో సీటు దొరకడం లేదు. ఈ పథకం అమల్లోకి రాకముందు రోజూ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య 12 లక్షలు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 30 లక్షలకు చేరుకుంది. మహిళలు ఎక్కువగా జీరో టికెట్‌ తీసుకుని బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ లేదు. ఆటోలు ఎక్కే వారు కరువయ్యారు. దీంతో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయం తమకు వ్యతిరేకంగా ఉందని వారు భావిస్తున్నారు. ప్రయాణికులు లేక రోజువారి ఆదాయానికి గండి పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Read also: Manchu Lakshmi : బాబోయ్.. ఏంటి లక్ష్మీ అరాచకం.. బికినీ లో ఫోటోషూట్..

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుమార్లు ఆటోడ్రైవర్లు నిరసనలు తెలిపారు. ప్రభుత్వ అధికారులతోనూ సమావేశమయ్యారు. మద్దతు కోరేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా కలిశారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రేపు (16న) ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి హైదరాబాద్ లోని నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ఆటో డ్రైవర్లందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.. ఆ రోజు ఒక్క ఆటో కూడా రోడ్డెక్కకూడదని డ్రైవర్లు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Farmers Protest: ఢిల్లీలో మూడో రోజు రైతుల ఆందోళన.. నేడు చర్చలకు పిలిచిన కేంద్రం!