
తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల ప్రధాన మంత్రి ప్రకటించిన జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని తేదీ 17 ఫిబ్రవరి 2024 నాడు లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష. గత పార్లమెంట్ ఎన్నికలలో పసుపు రైతులు పెద్ద ఎత్తున నిజామాబాద్ ఎం.పీ స్థానానికి నామినేషన్లు వేసి నిరసన తెలిపిన విషయము అందరికి విదితమే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి పసుపు బోర్డు ఏర్పాటుకు స్పష్టమైన వాగ్దానం ఇచ్చి, తర్వాత 4 అక్టోబర్ 2023 నాడు పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అందులో ఎక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రదేశంకాని, దానికి అవసరమగు బడ్జెట్ ప్రతిపాదన కానీ లేకుండా కేవలం కమిటీ సభ్యుల నియామకమునకు సంబందించి మాత్రమే వివరాలను గెజిట్లో పేర్కొన్నారు.
ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటు అయిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్ర పసుపు రైతుల ప్రయోజనాలపై సంబదిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రాష్టంలో పసుపు పండించే జిల్లాలలో నిజామాబాద్ జిల్లా ప్రధానమైనది. నిజామాబాద్ పసుపు రైతులు గత పది సంవత్సరాల నుండి పసుపు మద్దతు ధర కోసం మరియు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి క్రమం తప్పకుండా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 2019-20 సంవత్సరంలో 1,39,698 ఎకరాల విస్తిరణలో పసుపు సాగుకాబడి, 3,35,425 మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి కాగా 2022-23 సంవత్సరానికి వచ్చే సరికి 56,174 ఎకరాల విస్తరణంలో పసుపు సాగుచేయబడి 173,610 మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి జరిగినది. 2023-24 సంవత్సరంలో పసుపు సాగువిస్తీర్ణం 34,978 ఎకరాలు మాత్రమే.
ఈ నేపధ్యంలో పసుపు రైతులను బలోపేతం చేయడం కొరకు, పసుపు ధరల స్థరీకరణకు, పసుపుసాగు విస్తీర్ణం పెంచడానికి మరియు పసుపు అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి అవకాశాలు పెంచడానికి పసుపు రైతులు కోరుకుంటున్నట్లుగా జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినట్లయితే పసుపు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి వర్యులు పేర్కొన్నారు.
జాతీయ పసుపు బోర్డు దేశంలో పసుపు మరియు ఉత్పత్తులు అభివృద్ధి పెరుగుదల పై దృష్టి సారిస్తుంది. సుగంధ ద్రవ్యాల బోర్డు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలను సమన్వయం చేసుకొని పసుపు రంగం అభివృద్ధిని జాతీయ పసుపు బోర్డు సులభతరం చేస్తుంది. పసుపు యొక్క ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలపై ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో పసుపువినియోగంపై అవగాహన మరింత పెంచడానికి ఎగుమతి అవకాశాలను వృద్ధి చేయడానికి అంతర్జాతీయంగా కొత్త మార్కెట్ అవకాశాలను అభివృద్ధి చేయడానికి, పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులలో పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి మరియు సాంప్రదాయిక పద్ధతులద్వారా పసుపు ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఈ జాతీయ పసుపు బోర్డు ఉపయోగపడుతుందని మంత్రి వర్యులు పేర్కొన్నారు. విలువ ఆధారిత పసుపు ఉత్పత్తుల పై పరిజ్ఞానం పెంచడం తద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందటం కోసం పసుపు రైతుల సామర్ధ్యాన్ని పెంచుటకు మరియు నైపుణ్యాల అభివృద్ధిపై పసుపు బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని కావున రైతుల సంక్షేమంకోసం జాతీయ పసుపు బోర్డును తెలంగాణా రాష్ట్రంలో వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి వర్యులు ప్రతిపాదనలు పంపటం జరిగింది.