
గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి మండలంలో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. పండ్ల తోటలు, ఆయిల్ పామ్ గిరిజన రైతులకు సాగు కోసం అధిక శాతం నిధులు, ఆర్థిక వెసులుబాటు ఇవ్వబడుతుంది. ఆ దిశగా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృషి చేయాలని అన్నారు. భట్టి విక్రమార్క ఆదివారం జిల్లాలోని భద్రాచలం ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామన్నారు. గిరిజన రైతుల సాగును ప్రోత్సహించేందుకు ఇందిర జల ప్రభ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని, అందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు గిరిజనులకు, వారి పిల్లలకు మెరుగైన విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీడీఏ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఏఎన్‌ఎంలు, అంబులెన్స్‌ల కొరత ఉందని సీఎం పేర్కొన్నారు. అధికారులు స్థానిక నిరుద్యోగ గిరిజన యువకులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించి గిరిజనులకు వైద్యసేవలు అందించి, 24గంటలూ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజన కుటుంబాలందరికీ అందుతున్నాయన్నారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, పీ వెంకటేశ్వర్లు, డాక్టర్ టీ వెంకట్‌రావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కొత్తగూడెం, ఖమ్మం కలెక్టర్లు డాక్టర్ ప్రియాంక అల, వీపీ గౌతం, ఎస్పీ బీ రోహిత్‌రాజు తదితరులు పాల్గొన్నారు.