Leading News Portal in Telugu

Mallikarjuna Kharge : హైదరాబాద్‌కు చేరుకున్న ఖర్గే.. స్వాగతం పలికిన సీఎం రేవంత్‌



Mallikarjuna Kharge

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొనేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ తదితరులతో చర్చించే అవకాశం ఉందని సమాచారం. మహబూబ్ నగర్ నియోజకవర్గం అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించగా మిగిలిన 16 స్థానాలకు ఎంపిక చేయాల్సి ఉంది.

పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిని ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం నియమించింది. ఈ పదవికి రాజీనామా చేసి నాగర్‌కర్నూల్‌ టికెట్‌ ఇవ్వాలని సీఎంకు లేఖ పంపినట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు. ఈ సీటు కోసం అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు మరికొందరు నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సికింద్రాబాద్ సీటును వెనుకబడిన తరగతులకు ఇస్తే నగరంలో కాంగ్రెస్‌కు మద్దతు లభిస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రత్యర్థి బీఆర్ఎస్ కూడా వెనుకబడిన సామాజికవర్గ నేతకే సికింద్రాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ కోటాలో ఐదు రిజర్వ్‌డ్ సీట్లకు 50 మంది అభ్యర్థులు టికెట్లు కోరుతున్నారు. నాయకులు, ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, వైద్యులు, న్యాయవాదులు పోటీలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పీసీసీ ఆఫీస్ బేరర్లతో కాంగ్రెస్ వార్ రూమ్ కమిటీని ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా పవన్ మల్లాది నియమితులయ్యారు. అలాగే, సందేశ్ శింగాల్కర్, సతీష్ మన్నె, సంతోష్ రుద్ర , జక్కని అనిత కో-చైర్మెన్‌లుగా ఉన్నారు. పార్టీ శిక్షణ కోసం వసీం భాషా , ఆరోన్ మీర్జాలను , విశ్లేషకుడిగా శ్రీకాంత్ కుమ్మరిని నియమించగా, గిరిజా షెట్కార్, నవీన్ పట్టెం సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్‌మున్షీ అనుమతితోనే ఈ నియామకాలు జరిగాయని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.