
అటవీశాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ వేదికగా అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అరణ్యభవన్ కు వచ్చిన మంత్రికి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్, పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఎం.సీ. పర్గెయిన్, విజిలెన్స్ పీసీసీఎఫ్ ఏలూసింగ్ మేరు, అన్ని జిల్లాలకు చెందిన కన్జర్వేటర్లు, అటవీ అధికారులు హాజరయ్యారు.
సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తమది ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వమని, అధికారులు, సిబ్బంది తమ సమస్యలను స్వేచ్చగా చెప్పుకోవచ్చని అన్నారు. క్షేత్ర స్థాయి అధికారుల చెప్పిన విషయాలను ఓపికగా విన్న మంత్రి తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా రోడ్లు, భవనాల శాఖలో పనిచేశారని, ప్రభుత్వ ఉద్యోగుల కష్ట సుఖాలు తనకు తెలుసు అన్నారు. అదే సమయంలో ప్రతీ అధికారి కుటుంబంతో సహా పనిచేసే ప్రదేశంలోనే నివాసం ఉండాలన్నారు. అడవులు రక్షణ అనేది అన్నింటికంటే ముఖ్యమైన విధి అని, రానున్న రోజుల్లో అత్యంత సవాల్ తో కూడిన ఈ బాధ్యతలను అందరూ సమర్థవంతంగా నెరవేర్చాలన్నారు. ఇటీవల కాగజ్ నగర్ లో పులుల మరణం తనను కలిచివేసిందని, రానున్న రోజుల్లో అలాంటి సంఘటనలు జరగకూడదని అన్నారు.
అడవుల రక్షణపై కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అటవీ రక్షణ కమిటీల సమావేశాలు క్రమం తప్పుకుండా జరగాలని అన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటామని చెప్పినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. తెలంగాణ స్థానిక జాతులు చెట్ల విత్తనాలు సేకరించి, మెరుగైన మొక్కలను నర్సరీల్లో పెంచాలన్నారు. చింత, జామ, నేరేడు, రేగు, సీతాఫలం, మునగ లాంటివి పెంచటం వల్ల అటవీ జంతువులు బయటకు రాకుండా ఉంటాయన్నారు. హరితహారం వచ్చే సీజన్ పై జిల్లా సమీక్షా సమావేశాలు జరిపి లక్ష్యాలతో పాటు, అవసరమైన మెటీరియల్ ను సిద్దం చేసుకోవాలన్నారు.
రాష్ట్రంలో మిగతా పట్టణ ప్రాంతాలతో పాటు ట్రై సిటీస్ గా ఖ్యాతిగాంచిన వరంగల్, హన్మకొండ, ఖాజీపేట మూడు నగరాల్లో పచ్చదనం పెంపు, పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తాము, అదే సమయంలో చట్ట వ్యతిరేకంగా అడవుల ఆక్రమణ చేపడితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. అడవుల ఆక్రమణను సహించమని, గుత్తికోయ ప్రభావిత ప్రాంతాల్లో తదుపరి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఇతర శాఖల మద్దతు కూడా తీసుకోవాలని సూచించారు.
కొత్తగా అటవీ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బందికి ఆయుధాల విషయం ప్రభుత్వ పరిధిలో ఉందని, చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అడవులకు సంబంధించి కోర్టు వివాదాలను త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కూడా సత్వర చర్యలు తీసుకుంటామని అన్నారు. స్మగ్లర్లపై కఠిన చర్యల కోసం పీడీ యాక్ట్ పెట్టేందుకు పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో బాగా పనిచేసి అధికారులు, సిబ్బందిని మరింతగా ప్రోత్సహించేందుకు, అవార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ ను మంత్రి ఆదేశించారు.
వేసవిలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, జంతువులకు నీటి వసతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పెంపుడు పశువులు అడవుల్లోకి పోకుండా, అటవీ శివారుల్లో “పల్లె పశువుల వనాల” ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అన్నారు. అడవుల్లో ప్లాస్టిక్ నియంత్రణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, అలాగే మంచి ప్రాంతాలను గుర్తించి ఎకో టూరిజం అభివృద్ది ద్వారా ప్రజలకు పర్యావరణ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి తెలిపారు. ఎకోటూరిజంలో స్థానిక గిరిజనులకు, చెంచులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని అన్నారు. కంపా నిధుల వినియోగం, అడవుల పునరుద్దరణ, హరితనిధి, పోడు భూములకు పట్టాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతి, ఫారెస్ట్ కాలేజీ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం కేటాయించిన భూముల నోటిఫికేషన్లు తదితర అంశాలను సమీక్షా సమావేశంలో భాగంగా మంత్రి కొండా సురేఖ చర్చించారు.