
US Dreams: యువతలో అమెరికా కలలు పెరుగుతున్నాయి. డాలర్ డ్రీమ్స్‌తో అమెరికా బాట పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే, గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు అమెరికాలో కనిపించడం లేదు. ఉక్రెయిన్ యుద్ధం, కోవిడ్ మహమ్మారి ఇలా పలు సమస్యలతో ఆర్థిక రంగం కుదేలవుతోంది. ఇలాంటి సందర్భాల్లో అమెరికాకు వెళ్లి ఉద్యోగం సంపాదించుకుని, అక్కడే స్థిర పడాలనే కోరిక కాస్త కష్టం అవుతోంది. అయినా కూడా తమ దేశంలో చాలా మంది అక్కడికి వెళ్లేందుకే సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం భయాలతో ఇప్పటికే ఆ దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి.
Read Also: Pakistan: పాకిస్తాన్ పరిస్థితి ఇది.. పీఐఏ విమానాల్లో వెళ్లి కెనడాలోనే సెటిల్ అవుతున్న “ఎయిర్‌హెస్టెస్‌లు”..
ఇదిలా ఉంటే, అమెరికాలో సొంతగా కంపెనీ పెట్టలేకపోయాననే బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీన్పూర్ పరిధిలో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూర్ మండలం ముత్యాల పల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాశీ విశ్వనాథ్(38) పటాన్చెరు పరిధిలోని అమీన్పూర్ దుర్గా హోమ్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
అమీన్పూర్ ఎస్ఐ ఈవీ రమణ వివరాల ప్రకారం..మాదాపూర్‌లో ఎడాట్ ప్రైమ్ సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పిన విశ్వనాథ్, ఆరు నెలల క్రితం అమెరికాలో మరో కంపెనీ పెట్టడానికి వెళ్లాడు. అయితే, అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో కిటికీ ఊచలకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును పోలీసులు విచారిస్తున్నారు.