
కాడెడ్లలా కలిసి నడవాల్సిన, పార్టీని నడిపించాల్సిన వాళ్ళు కీచులాటలకు దిగుతున్నారు. కేరాఫ్ కలహాల కాపురంలా మారిందట వారి వ్యవహారం. నాకు ఒక కన్ను పోయినా ఫర్వేదు… ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలన్న సిద్ధాంతంతో పనిచేసిన ఇద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. చివరికి సవతి ముండమోయాలన్నట్టుగా మారిందట ఇద్దరి వ్యవహారం. ఎవరా ఇద్దరు నేతలు? ఏంటి వాళ్ళ కీచులాట కహానీ?
ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ల మధ్య విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గే సూచనలైతే కనిపించడం లేదు. సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు మొదలైన వైరం అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత ముదిరిందట. శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇద్దరు నేతలు మరింత ఎడమొఖం పెడముఖంగా ఉంటున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. కార్యక్రమాల్లో ఎక్కడా కలిసి కనిపించడం లేదు. ఒకరు వస్తే ఇంకొకరు ఆ కార్యక్రమానికి డుమ్మా కొడుతున్నారని వాపోతోంది కేడర్. ప్రజాహిత యాత్ర పేరుతో పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నిలకు సమాయాత్తం చేస్తున్నారు బండి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరగుతున్న ఈ యాత్ర ఇప్పటి వరకు వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్‌లలో సాగి హుజూరాబాద్ చేరుకుంది. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు, నేతలు అందరూ పాల్గొంటున్నా…హుజూరాబాద్‌లో ఈటలగానీ, ఆయన మనుషులుగానీ కనిపించక పోవడం ఆసక్తికరంగా మారింది. అసలు 20 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న రాజేందర్ ఓడిపోయాక హుజూరాబాద్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. మల్కాజ్‌గిరి మీద మోజుతోనే పాత నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదన్నది లోకల్ టాక్. అసెంబ్లీ ఎన్నికల పోస్ట్‌మార్టంలో కూడా నేతల మధ్య విభేదాలతోనే కొన్ని సీట్లను కోల్పోయామని గుర్తించారట పార్టీ పెద్దలు. ఒకరినొకరు ఓడించుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అధిష్టానం దృష్టికి వెళ్లాయట.
పార్టీ అగ్రనేత అమిత్ షా ఇద్దరినీ పిలిచి క్లాస్ పీకినా పద్ధతి మాత్రం మారలేదంటున్నారు కార్యకర్తలు. ఒకరిని ఒకరు డామినేట్ చేసే పద్దతి మంచిది కాదు.. రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తలంటి పంపినా నేతల తీరు మాత్రం మారలేదట. మరోవైపు ఈటల వల్ల పార్టీకి ఒనగూరిన ప్రయోజనం ఏంటనే చర్చ కూడా మొదలైనట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా జరక్కుండా ఉండేందుకు ఈసారి ముందుగానే మేల్కొన్నారట సంజయ్.. హుజురాబాద్‌లో తన ఓటింగ్ తగ్గకుండా ఉండాలంటే ఈటల వర్గం మీదనే ఆధారపడ కూడదన్న ఉద్దేశ్యంతో తరచూ అక్కడే తిరుగుతున్నారట. గత లోక్‌సభ ఎన్నికలకంటే ఈసారి పరిస్థితి వేరుగా ఉందని గ్రహించిన బండి సంజయ్… పార్టీలోని సీనియర్లను తనకు వ్యతిరేకంగా ఉసిగొల్పడంలో ఈటల పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తొలుత కరీంనగర్ ఎంపీ సీట్ ఆశించిన రాజేందర్‌కు చెక్ పెట్టడంలో సఫలమయ్యారట సంజయ్. కరీంనగర్‌లో సంజయ్‌కి లైన్ క్లియర్ అయినప్పటికీ పంటి కింది రాళ్లలా తగులుతున్న పార్టీలోని అసమ్మతిని డీల్ చేయడం ఇప్పుడు సవాల్‌గా మారిందట… ప్రజాహిత యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అటు ప్రత్యర్థి పార్టీలకు, ఇటు పార్టీలోని అసమ్మతులకు ధీటుగా సమాధానం చెప్పవచ్చని భావిస్తున్నట్టు చెబుతున్నారు సంజయ్ సన్నిహితులు. సంజయ్ దూకుడుతో మైలేజ్ వస్తున్నా… హుజురాబాద్‌లాంటి కీలక నియోజకవర్గంలో సీనియర్ నేత సహకారం లేకుండా ఎలా అన్న గుబులు కూడా బండి శిబిరంలో ఉన్నట్టు తెలిసింది. ఇక్కడ ఈటలకున్న సొంత ఓటు బ్యాంకు ఎటు వెళ్తుందన్నది ఆసక్తిగా మారింది. సంజయ్‌కి ఈటలకు మధ్య వార్ ఇలాగే కంటిన్యూ అయితే పార్లమెంట్ ఎన్నికల నాటికి రాజకీయాలు రెండు రెళ్ళు ఆరు లాగా మారే ప్రమాదం ఉందంటున్నారు పరిశీలకులు.