Leading News Portal in Telugu

Off The Record : CM Revanth Reddyని ఫాలో అవ్వాలనుకుంటున్న ఆ BJP ముఖ్య నేత.. ఎందుకు..?



Etela Otr

ఆ బీజేపీ ముఖ్యనేత ఐ వాంట్‌ టు ఫాలో.. ఫాలో అంటున్నారా? ఆ… అయ్యేదేదో సొంత పార్టీ వాళ్ళని కాకుండా రాజకీయ ప్రత్యర్థుల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారా? వాళ్ళు వీళ్ళు అయితే… కిక్కేముంటుంది… మన రేంజ్‌కి తగ్గట్టు ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డినే అనుకరిద్దామనుకుంటున్నారా? కాలం, ఖర్మం కలిసొస్తే రేవంత్‌లాగే తానూ అదో ఒక రోజున సీఎం అవ్వొచ్చని కలలుగంటున్నారా? ఇంతకీ ఎవరా లీడర్‌? ఏంటాయన కథ?

పోగొట్టుకున్న చోటే వెదుక్కోమన్నది పెద్దల మాట. కానీ… అన్ని చోట్ల, అన్ని సందర్భాల్లో ఇది వర్కౌట్‌ కాదన్నది కొందరు రాజకీయ నేతల మాట. అందుకు తగ్గట్టే వాళ్ళ వ్యూహాలు, వ్యవహారాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. గెలిచినా ఓడినా ఒకే నియోజకవర్గాన్ని పట్టుకుని వేలాడే నేతల సంఖ్య తగ్గిపోతోంది. ఇక్కడ పోగొట్టుకున్నదాన్ని ఎక్కడో వెదుక్కుందామంటూ పరుగులుపెట్టే పొలిటీషియన్స్‌ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో కొందరు సీనియర్స్‌ సైతం ఇప్పుడు ఇదే రూట్‌లో వెళ్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన చాలామంది నేతలు లోక్‌సభ బరిలో దిగేందుకు తహతహలాడుతున్నారు. అందులో బీజేపీ సీనియర్‌ లీడర్‌ ఈటల రాజేందర్‌ ముందు వరుసలో ఉన్నారట. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో కూడా పోటీచేసి రెండు చోట్ల ఓడిపోయారు ఈటల. ఇప్పుడాయన లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ టిక్కెట్‌ మీద గురిపెట్టిన రాజేందర్‌… దాని కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడే ఎక్కువ మందికి డౌట్స్‌ వస్తున్నాయట. పోటీ చేస్తే గీస్తే… తన సొంత నియోజకవర్గం ఉన్న కరీంనగర్‌లో చేయాలి. లేదంటే… గజ్వేల్‌ ఉన్న మెదక్‌ ఎంపీ సీట్లో పోటీకి దిగాలి. మరి ఆ రెండిటినీ కాదని మల్కాజ్‌గిరి కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నది క్వశ్చన్‌. దాని కోసమే ఎందుకంత గట్టిగా పట్టుబడుతున్నారన్నది చర్చ. ఆ రెండిటి పరంగా చూసుకున్నా…. కరీంనగర్‌లో పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి ఆ సీటు అడక్కపోవడంలో అర్ధం ఉంది. కానీ… గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గజ్వేల్ ఉన్న మెదక్‌ను ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? మెదక్ వద్దు మల్కాజ్ గిరి ముద్దు అని ఎందుకు అంటున్నారన్న ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో ఉన్నారు పరిశీలకులు.

అదే సమయంలో ఈటల సీఎం రేవంత్ రెడ్డి బాటలో నడుస్తున్నారా అన్న డౌట్స్‌ కూడా వస్తున్నాయట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఓడిపోయాక… 2019 లోక్‌సభ ఎలక్షన్స్‌లో కొడంగల్‌తో ఏ మాత్రం సంబంధం లేని మల్కాజ్ గిరి లోక్‌సభ సీటులో పోటీచేసి గెలిచారు రేవంత్‌. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. తాజా ఎన్నికల్లో తిరిగి కొడంగల్‌ నుంచే గెలిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఈ సీక్వెన్స్‌ని, సెంటిమెంట్‌ని దృష్టిలో ఉంచుకునే… ఈటల రాజేందర్‌ కూడా చాలా ముందు చూపుతో మల్కాజ్‌గిరి ఎంపీ టిక్కెట్‌ కోసం పట్టుబడుతున్నారా అన్న సందేహాలు వస్తున్నాయట ఎక్కువ మందికి. రేవంత్‌కు వర్కౌట్‌ అయినట్టు తనకు కూడా ఈ సెంటిమెంట్ పని చేస్తుందని మాజీమంత్రి భావిస్తున్నారా అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయట. మల్కాజ్ గిరిలో గెలిచాక రేవంత్‌రెడ్డి స్టార్ తిరిగిపోయింది. అందుకే ఇపుడు ఈటల కూడా మల్కాజ్‌గిరి నుంచి గెలిచి తన ఫేట్‌ మార్చేసుకోవాలనుకుంటున్నారా? ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం ఎక్కేసి ఆ తర్వాత టైం కలిసొస్తే…. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే… సీఎం కుర్చీ కూడా ఎక్కేయాలనుకుంటున్నారా అన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోందంటున్నారు. ప్రస్తుతానికి మల్కాజ్‌గిరి ఎంపీ టిక్కెట్‌ తనకు కన్ఫామ్‌ అని ఈటల ఆశగా ఉన్నా… అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. మరి అధిష్టానం ప్రకటించే లిస్ట్‌లో మల్కాజ్‌గిరికి ఈటల పేరు ఉంటుందో లేదో చూడాలి మరి.