
పెండింగ్ సీట్ల విషయంలో తెలంగాణ బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోందా? దీటైన అభ్యర్థులు దొరక్క ఎదురు చూపులు తప్పడం లేదా? టిక్కెట్ ఇస్తే పోటీ చేసేవాళ్ళు ఉన్నా… కాషాయ దళానికి సరైనోళ్ళు దొరకడం లేదా? మిగిలిన 8 సీట్ల విషయంలో ఎలాంటి కసరత్తు జరుగుతోంది? ఎవరెవరి తలుపులో తడుతున్నా స్పందన ఎందుకు రావడం లేదు? తెలంగాణలోని 17లోక్‌సభ సీట్లకుగాను 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఇంకా 8 పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, అదిలాబాద్ నియోజక వర్గాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆయా నియోజకవర్గాల సీట్ల కోసం పలువురు పోటీ పడుతున్నా….మహబూబ్‌నగర్ మాత్రం పీటముడి పడిందంటున్నారు. ఆ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు ఓ రేంజ్లో లాబీయింగ్ చేస్తుండటంతో ఎటూ తేల్చుకోలేకపోతోందట అధిష్టానం. ఇక సిట్టింగ్ సీటు ఆదిలాబాద్‌లో సోయం బాపూరావును పక్కన పెట్టడం దాదాపు ఖాయమైపోయింది. దీంతో అక్కడ ఎవరన్నది క్లారిటీ రాలేదు. అటు ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి ఎవరన్నా వస్తారేమోనని చూస్తున్నారట కాషాయ నేతలు. నల్గొండ కోసం బీఆర్ఎస్ నేతలను సంప్రదించినట్లు సమాచారం. సైదిరెడ్డి, తేరా చిన్నప రెడ్డితో పాటు మరో ఇద్దర్ని కూడా బీజేపీ టచ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మేటర్ మాత్రం కొలిక్కి రాలేదని సమాచారం. మెదక్ సీటు కావాలని రఘునందన్ రావు అడుగుతున్నా బీజేపీ పెద్దలు మాత్రం ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెదుకుతున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిని పోటీ చేయమని అడుగుతున్నారట. పెద్దపల్లి కోసం ఘంటా చక్రపాణిని సంప్రదించారట బీజేపీ నేతలు. అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. అలాగే మిట్టపల్లి సురేందర్ పేరు కూడా పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నట్టు తెలిసింది.
మహబూబాబాద్ విషయంలో కూడా ఎటూ తేల్చుకోలేకపోతోంది కాషాయ నాయకత్వం. ఇక్కడ ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక అడుగు ఆలస్యమైనా… ఆయా సీట్లలో బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపి సత్తా చాటాలన్నది బీజేపీ అధిష్టానం ఆలోచనగా తెలిసింది. వరంగల్ అభ్యర్థి కోసం కూడా గాలిస్తోంది పార్టీ. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ని సంప్రదించినా వర్కౌట్ కాలేదట. అక్కడ ఇంకెవరన్నా ఉన్నారా అని జల్లెడ పడుతోంది బీజేపీ. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అందుకే బీజేపీ కూడా తెలంగాణను ప్రత్యేకంగా పరిగణిస్తోందట. ఇక్కడ తాము ఎక్కువ సీట్లు గెల్చుకోవడం, అదే సమయంలో కాంగ్రెస్‌ను కట్టడి చేయడమన్న అజెండాతో అభ్యర్థుల వేట కొనసాగిస్తున్నట్టు చెబుతున్నాయి బీజేపీ వర్గాలు.