Leading News Portal in Telugu

TSUTF : కోర్టు ఆటంకాలను తొలగించి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి



Tsutf

న్యాయపరమైన చిక్కులను తొలగించి ఉపాధ్యాయుల బదిలీలు,పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విస్తృత కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. రెండవ రోజు హైదరాబాద్ లోని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కే .జంగయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి లు ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కోర్టు ఆటంకాలను తొలగించి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మల్టీ జోన్ 2 జడ్పీ హైస్కూల్ హెచ్ఎం ప్రమోషన్స్ నిలిచిపోయాయి. కోర్ట్ కేసు కారణంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు స్కూల్ అసిస్టెంట్స్ బదిలీలను ఆపడం కోసం సీనియారిటీ జాబితాపై కేసు వేశారు. ఇటీవల ఎమ్మెల్సీ నర్సిరెడ్డి జోక్యం చేసుకొని సీఎం, సిఎం సలహాదారు, అడ్వకేట్ జనరల్ తో చర్చించిన ఫలితంగా కేసులో కొంత పురోగతి వచ్చింది. ఒకటి రెండు రోజుల్లో డైరెక్షన్ వచ్చిన వెంటనే ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు స్వల్పంగా పెంచడం అభినందనీయమని అన్నారు.

 

అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని(సిపిఎస్)రద్దు చేస్తాను ఇచ్చిన హామీని గుర్తు చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు సామాజిక భద్రతను కల్పించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న 4 విడతల డి.ఎ.ను వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేశారు.ఈ నెల మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జి.ఓ. 317 అమలు కారణంగా ఏర్పడిన సమస్యలను అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన పరిష్కార మార్గాలను సిఫారసు చేయటానికి ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖామంత్రి శ్రీ దామోదర రాజనర్సింహా చైర్మన్ గా మంత్రులు డి. శ్రీధర్ బాబు, శ్రీ పొన్నం ప్రభాకర్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. క్యాడర్ సీనియారిటీ కారణంగా స్థానికత కోల్పోయిన వారికి జి.ఓ. 317 కారణంగా వేరు చేయబడి బ్లాక్ చేయబడిన 13 జిల్లాల్లో బదిలీల కోసం ఎదురుచూస్తున్న స్పౌజ్లకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము.పండిట్,పి ఇ టి ల అప్గ్రేడేషన్ సమస్యను పరిష్కరించి పండిట్, పి ఇ టి లకు ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు. ఉన్నత పాఠశాలలో జూనియర్,రికార్డ్ అసిస్టెంట్స్ ని నియమించాలని,పాఠశాలల శుభ్రతకై పారిశుధ్య కార్మికులను నియమించాలని.KGBV ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పే వర్తింప చేసి ఉద్యోగులతో సమానంగా అన్ని సెలవులు వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకొవాలని అన్నారు .ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు , మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఉన్నారు. సమావేశంలో విద్యా రంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, చావ దుర్గా భవాని , కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, పత్రిక సంపాదకులు పి మాణిక్‌రెడ్డి, కుటుంబ సంక్షేమ నిధి , రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కే. సోమశేఖర్, ఎం వెంకటి, వి.శాంతికుమారి, ఈ గాలయ్య, ఎస్‌ మల్లారెడ్డి, డి సత్యానంద్‌, జి నాగమణి, కె రవికుమార్‌, ఎస్‌ రవిప్రసాద్‌గౌడ్‌, ఎ సింహాచలం, వై జ్ఞానమంజరి,ఆడిట్ కమిటీ కన్వీనర్ మహబూబ్‌అలీ , వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు , రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.