Leading News Portal in Telugu

BRS: మరో నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌.. ఎవరంటే?



Kcr

BRS: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్ల పోటీ చేసే మరో నలుగురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లను మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌, వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్య పేరును ప్రకటించారు. జహీరాబాద్‌ నుంచి గాలి అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్లను కేసీఆర్ ప్రకటించారు. నేటి వరంగల్ ముఖ్యనేతలతో జరిపిన చర్చల అనంతరం సమష్టి నిర్ణయాన్ని అనుసరించి వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను అధినేత కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్‌కు అవకాశం ఇచ్చారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. మరోమారు పోటీకి సిద్ధమన్న పసునూరి దయాకర్‌… అవకాశం ఇవ్వకపోయినా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. మహబూబ్ నగర్  నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Read Also: BJP 2nd List: నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ఖట్టర్.. బీజేపీ రెండో లిస్టులో ఉన్న కీలక నేతలు వీరే..

తాజాగా ఇద్దరు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా  తొమ్మిదికి చేరింది. ఇంకా 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ ప్రకటించాల్సి ఉంది. మొదటి జాబితాలో కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానానికి బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి స్థానానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఎంపిక చేశారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్‌ (ఎస్టీ రిజర్వ్‌) స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.