Leading News Portal in Telugu

Kishan Reddy : అతిథిదేవోభవ స్ఫూర్తి.. భారతదేశ జీవన విధానం



Kishan Reddy

కాన్హాశాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. అతిథిదేవోభవ స్ఫూర్తి.. భారతదేశ జీవన విధానమన్నారు. గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ లో ఇవాళ ఇక్కడ పాల్గొంటున్న మీ అందరికీ సుస్వాగతమని, ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్ ‑ మనశ్శాంతి నుంచి ప్రపంచశాంతి దిశగా మనం ప్రయాణించాల్సిన మార్గాన్ని నిర్దేశించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. 132 ఏళ్ల క్రితం.. అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత మహాసభల్లో స్వామి వివేకానందుడు అందించిన సందేశం యావత్ ప్రపంచానికి భారతదేశ తత్వాన్ని మరోసారి గుర్తుచేసిందని, భారతదేశం ప్రపంచంలోని దేశాలన్నింటికీ మిత్రదేశమని కిషన్ రెడ్డి అన్నారు.

అంతేకాకుండా..’ప్రపంచంలో ఎక్కడ ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నా.. భారతదేశం శాంతిమంత్రాన్నే బోధించింది. భారతదేశం నాలుగు మతాలకు పుట్టినిల్లు. హిందూమతం, బౌద్ధమతం, సిక్కుమతం, జైనమతం. ఈ మతాలన్నీ శాంతి, సామరస్యం, పరోపకారాన్ని ప్రపంచానికి బోధించాయి. ప్రాచీనకాలం నుంచి భారతదేశం ఆత్మశోధనకు కేంద్రంగా ఉంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తత్వవేత్తలు, మేధావులు స్వయంశోధనకు భారతదేశం వచ్చేవారు. భారతదేశంలో తత్వవేత్తలు సమాజంలోని అసమానతలు రూపుమాపేందుకు కృషిచేశారు. ఇందులో ఆదిశంకారాచార్య, రామానుజాచార్య, బసవణ్ణ.. తర్వాత.. శ్రీ అరబిందో, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి వారెందరో ఇందుకు కృషిచేశారు. ప్రపంచమంతా ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు భారత్ మొదట్నుంచీ కృషిచేస్తోంది. ఇకపైనా ఈ ప్రయత్నం కొనసాగనుంది. ప్రపంచశాంతి లక్ష్యంగా ఉద్దేశించిన ఈ కార్యక్రమం సంకల్పిత లక్ష్యాలను చేరుకోగలదనే విశ్వాసం నాకుంది. ఈ దిశగా మీ అందరి సహకారం కావాలి’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌ఖర్, శ్రీమతి సుదేశ్ జగదీప్ ధన్‌ఖర్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ సాంస్కృతిక మంత్రి శ్రీ జూపల్లి ష్ణారావు, గ్లోబల్ గైడ్ ఆఫ్ హార్ట్‌ఫుల్‌నెస్ శ్రీ కమలేశ్ డి పటేల్ (దాజీ) తోపాటుగా.. భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆధ్యాత్మిక విధానాలను అనుసరించే స్పిరిచువల్ గురువులు పాల్గొన్నారు.