
వరుస దూకుళ్ళతో గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గేట్స్ ఓపెన్ అని చెప్పాక పరిస్థితులు ఎలా మారుతున్నాయి? రెడీ.. గెట్ ..సెట్.. అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు? మర్యాదపూర్వకంగా అంటూ గతంలోనే సీఎంని కలిసిన వారిని ఎలా చూడాలి? జంపింగ్ జపాంగ్‌లపై పార్టీ అధిష్టానం వ్యూహం ఎలా ఉండబోతోంది? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడంతా జంపింగ్ జపాంగ్‌ల సీజన్ నడుస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు జంప్ కొట్టేస్తున్నారు నేతలు. ఈ క్రమంలో అందరికంటే ఎక్కువ నష్టపోతోంది బీఆర్ఎస్. అధికారం కోల్పోయాక ఆ పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళేగానీ… కారెక్కే వాళ్ళు అత్యంత అరుదుగా ఉన్నారు. గులాబీ పార్టీ నుంచి ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల కోసం గేట్లు తెరిచాం అని ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి ఇంకా కొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా సీఎం రేవంత్‌ను కలుస్తున్నారు. అందులో కొందరు ఓపెన్ అవుతుండగా… ఎక్కువ మంది మాత్రం మర్యాదపూర్వకంగా అనో, నియోజకవర్గం అభివృద్ధి కోసమనో చెబుతూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైకి ఏం చెబుతున్నా…. అంతర్గతంగా అందరి టార్గెట్ ఒక్కటేనన్నది మాత్రం ఓపెన్ సీక్రెట్. మొదట్లో ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ సీఎంని కలిసినప్పటికి కాంగ్రెస్ గేట్లు ఎత్తలేదు.
కానీ ఇప్పుడు పార్టీలోకి చేరికల వరద మొదలవడంతో… బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి సీఎం కలిసిన వారిలో మొదటి వరుసలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలే ఉన్నారు. వారిలో కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్ రావు, గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత అధిష్ఠానం ఆదేశాలతో మీడియా సమావేశంపెట్టి మరీ మేం పార్టీ మారడం లేదని ప్రకటించారు. కానీ… ఇప్పుడు కాంగ్రెస్ గేట్లు ఓపెన్ అని చెప్పిన తరువాత ఈ నలుగురు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా సీఎంని కలిశారు. అప్పటి ఖమ్మం సభలోనే కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగినా చివరి నిమిషంలో ఆగిపోయింది. మంత్రి పొంగులేటికి సన్నిహితుడన్న పేరున్న తెల్లం వెంకట్రావు ఏ క్షణంలో అయినా పార్టీ మారుతారన్న టాక్ నడుస్తోంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత పార్టీ మారడం కోసం కాదు అని చెప్పినప్పటికీ ముందు ముందు వీరి వైఖరి ఎలా ఉంటుందోనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు గ్రేటర్లో బీఆర్ఎస్కు పార్టీకి బలమైన నేతగా వున్న మాజీ మంత్రి మల్లారెడ్డి గులాబీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. బెంగుళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్ ను తన కుమారుడు భద్రారెడ్డితో కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వ్యాపార సంబంధిత అంశంపై మాత్రమే శివకుమార్ ను కలిశాను అని మల్లారెడ్డి చెబుతున్నా ఒకటి,రెండు రోజుల్లో కాంగ్రెస్ గూటికి చేరతారన్న టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంతటా బీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీచినా… గ్రేటర్ హైదరాబాద్ అండగా నిలిచింది. ఇక్కడే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి.
దీంతో జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూడకుండా నానా తంటాలు పడుతోందట బీఆర్ఎస్ అధినాయకత్వం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోగా… దానం నాగేందర్ పార్టీ మారడంతో ఇప్పుడా బలం 37కు తగ్గింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు నేతలు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో గులాబీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు.