Leading News Portal in Telugu

Off The Record : మేయర్‌గద్వాల విజయలక్ష్మి కూడా కారు దిగేస్తున్నారా..?



Gadwal Vijayalaxmi Otr

గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి కూడా కారు దిగేస్తారా? ఆమె పార్టీ మారిపోవడం ఖాయమైనట్టేనా? అదే నిజమైతే బీఆర్‌ఎస్‌ ముఖ్య నేత కే.కేశవరావు పరిస్థితి ఏంటి? తనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్‌కు హ్యాండిస్తారా? లేక తండ్రీ కూతుళ్లు చెరో పార్టీలో ఉంటారా? మేయర్‌ పార్టీ మార్పు కేంద్రంగా జరుగుతున్న రాజకీయం ఏంటి? వలస నేతల కోసం తెలంగాణ కాంగ్రెస్‌ గేట్లు తెరిచాక బీఆర్‌ఎస్‌ కారుకు కుదుపులు పెరిగిపోతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు బడా నేతలు కూడా కండువా మార్చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి నేరుగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ వెళ్లి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే కారు దిగాలా వద్దా అన్నది అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారట విజయలక్ష్మి. ఆమె పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతోంది. కానీ… ఇక్కడే అసలు కథ మొదలైంది. గద్వాల విజయలక్ష్మికి మేయర్‌ పదవి వచ్చింది ఆమె తండ్రి కేశవరావు వల్లనే అన్నది జగమెరిగిన సత్యం. అందుకే కార్యకర్తలతో చర్చించడం కాదు… తండ్రితో మాట్లాడుకుని ఆమె మేటర్‌ని ఫైనల్‌ చేస్తారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈలోపే ఆమె బీఆర్‌ఎస్‌ను వదలకుండా చూసేందుకు యాక్షన్ మొదలైందంటున్నారు. మేయర్ పదవి కోసం చాలా మంది పోటీ పడినా మీకే ఇచ్చామని, ఇప్పుడు పార్టీ వదిలి వెళ్తామంటే ఎలాగంటూ పెద్దలు మొహమాట పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పార్టీ మారకుంటే మేయర్ పదవి నుంచి తొలగించేలా కాంగ్రెస్ పావులు కదిపే అవకాశం ఉందని భయపడుతున్నారట విజయలక్ష్మి.

అదే విషయాన్ని బీఆర్‌ఎస్‌ పెద్దలకు చెప్పినట్టు తెలిసింది. అందుకు గులాబీ పెద్దలు మరో బంపరాఫర్‌ ఇచ్చారట. ఒకవేళ మేయర్ పదవి పోయినా ఖైరతాబాద్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది కాబట్టి… ఆ టిక్కెట్‌ మీకే టికెట్ ఇస్తామని చెప్పినట్టు సమాచారం. ఇక కేకే విషయానికి వస్తే..పార్టీలో కేసీఆర్ తర్వాతి పొజిషన్ ఆయనకే ఇచ్చామని చెబుతున్నారు బీఆర్‌ఎస్‌ నాయకులు. రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చామని, జాతీయ స్థాయిలో పెద్ద పదవి అయిన పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా కొనసాగుతున్నారని గుర్తు చేస్తున్నాయి పార్టీ వర్గాలు. కానీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జిగా ఉన్న దీపాదాస్‌ మున్షీతో కేకేకు పాత పరిచయాలు ఉన్నాయి. ఆయన పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్‌ ఇంఛార్జిగా ఉన్నప్పుడు దీపా భర్త ప్రియరంజన్‌ దాస్ మున్షీతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అలాంటి కుటుంబ సాన్నిహిత్యం ఉన్న కేకే ను పార్టీ లోకి ఆహ్వానించేందుకే స్వయంగా దీపా వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నది మరో వెర్షన్‌. కానీ ఆమె వెళ్ళే సమయానికి కేకే ఇంట్లో లేకుండా ముఖం తప్పించినట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ని వదిలి కాంగ్రెస్ కు వెళ్లేందుకు ఇష్టం లేకపోవడం వల్లనే కేశవరావు సైడైపోయారని అంటున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే… హైదరాబాద్ మేయర్ పార్టీ మార్పు పై ఎలాంటి క్లారిటీ రాలేదు. రెండు మూడు రోజుల్లో ఆమె కండువా మార్చేస్తారన్న ప్రచారం ఒకవైపు, కేకే ఏం చేయబోతున్నారన్న సస్పెన్స్‌ మరోవైపు కొనసాగుతున్నాయి. మరి చివరికి తండ్రీ కూతుళ్ళు ఇద్దరూ చెరో పార్టీలో ఉంటారా అన్నది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.