
రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హోలి పండుగను రాష్ట్ర ప్రజలు సోమవారం కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. హోలి పండుగ అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి సంతోషంగా సాగాలన్న సందేశాన్ని ఇస్తుందన్నారు. ఈ రంగుల వసంతోత్సవం ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపాలని, సంతోషం, ఔన్నత్యం, ఉల్లాసం, ఆనందాల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని శాంతి సౌఖ్యాలు నింపాలన్నారు.
పిల్లా పెద్దా తేడా లేకుండా సింగిడి రంగుల నడుమ ఖేలీ కేరింతలతో సాగే హోళీ, మానవ జీవితమే ఒక వేడుక అనే భావనను, ప్రకృతితో మమేకమై జీవించాలనే తత్వాన్ని మనకు అందిస్తుందన్నారు. బేధభావాలను వీడి పరస్పర ప్రేమాభిమానాలను చాటుకుంటూ ప్రజలందరూ మోదుగుపూల వంటి సహజసిద్దమైన రంగులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల హామీల అమలుతో సకల జనుల జీవితాల్లో నిత్య వసంతాన్ని నింపిందన్నారు. ప్రజలందరి జీవితాల్లో నూతనోత్తేజం వెల్లివిరిసేదాకా తమ కృషి కొనసాగుతూనే వుంటుందని తెలిపారు.