
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోలీ వేడుకల సందర్భంగా చెంగిచర్లలో జరిగిన దాడిలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న రాజాసింగ్‌ను హౌజ్ అరెస్ట్ చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. చెంగిచర్ల ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోహింగ్యాల దాడిలో గాయపడ్డ పేదలను సిట్టింగ్ ఎమ్మెల్యే పరామర్శించడానికి వెళ్లాలనుకోవడమే నేరమా? అని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Summer Effect: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న సూరీడు.. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు
గత పాలనలో కేసీఆర్ రజాకార్ల పాలనను రుచి చూపిస్తే.. కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎమర్జెన్సీ నాటి ఇందిరమ్మ పాలనను చూపిస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి దమ్ముంటే చెంగిచర్లలో రోహింగ్యాలు చేస్తున్న మాఫియా దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినా పట్టించుకోరా? అని నిలదీశారు. పేద ప్రజల మీద దాడులు చేయకుండా చెక్ పోస్టులు, బ్యారికేడ్లు పెట్టడం చూశాం.. కానీ పేదలకు భరోసా కల్పించేందుకు వెళుతున్న వారిని అడ్డుకునేందుకు బ్యారికేడ్లు పెట్టడమేంటి? అని అడిగారు. హౌజ్ అరెస్ట్‌తో రాజాసింగ్‌ను అడ్డుకోలేరన్నారు. నిన్న చెంగిచర్ల వెళ్లిన తనతో సహా బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తారా?,
అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేరన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక కేసుల పేరుతో రోహింగ్యాల దాడిని తప్పుదారి పట్టించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మా సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని హెచ్చరించారు. తక్షణమే బీజేపీ కార్యకర్తలతో పాటు పేదలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Govinda: ఏక్‌నాథ్ షిండేని కలిసిన బాలీవుడ్ స్టార్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ..?