Leading News Portal in Telugu

Revanth reddy: కొడంగల్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యం



Cm Revnth

కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన ఓటు వేశారు. అనంతరం కొడంగల్‌ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా నిలిచారని తెలిపారు. అందుకే కొడంగల్‌ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

 

R 1

త్వరలో కొడంగల్ ప్రాంతానికి సిమెంటు పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నా.. గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు రాలేదని తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు జరిగితే ఈ ప్రాంతంలో భూముల విలువలు పెరుగుతాయని వెల్లడించారు. ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని రేవంత్ పేర్కొన్నారు.

 

R 2

భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమల ఏర్పాటు సులభతరం అవుతుందని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. భూసేకరణలో పట్టా భూములకు, అసైన్డ్ భూములకు ఒకే ధర చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అభివృద్ధికి సహకరించకపోతే మాత్రం కొడంగల్ ప్రాంతం నష్టపోతుందని చెప్పుకొచ్చారు. తాను ఎక్కడున్నా ఓ కన్ను మాత్రం కొడంగల్‌పై ఉంటుందని.. మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుకుంటానని సీఎం హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Govinda: ఏక్‌నాథ్ షిండేని కలిసిన బాలీవుడ్ స్టార్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ..?

కొడంగల్ ప్రాంతం అభివృద్ధిలో పరుగులు తీయాలన్నదే తన ఆకాంక్ష అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తాను ఎంత పెద్ద నాయకుడినైనా కొడంగల్ కుటుంబ సభ్యుడినేనని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50 వేల మెజారిటీ అందించాలని కోరారు. మండల, బూత్, నియోజకవర్గ స్థాయిలో ఐదుగురు సభ్యుల చొప్పున సమన్వయ కమిటీ నియమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను మళ్లీ ఏప్రిల్ 8న కొడంగల్‌కు వస్తానని తెలిపారు. మండలాల వారీగా సమన్వయ కమిటీలతో సమావేశమవుతానన్నారు. ఇక ఏప్రిల్ 6న సాయంత్రం 5గంటలకు తుక్కుగూడలో జరిగే సభకు నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Monal Gajjar : అదిరేటి డ్రెస్సులో కుర్రాళ్లకు దడ పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. దేవకన్యలా ఉంది..