
Off The Record: తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి తలంటు స్నానాలు అవుతున్నాయా? నేరుగా పచ్చి బూతులు తిట్టడం ఒక్కటే మిగిలిపోయిందా? ఎంత చెప్పినా మీరు మారరా… అంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి డ్యాష్ డ్యాష్ అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లోక్‌సభ ఎన్నికల వేళ టీ బీజేపీలో ఏం జరుగుతోంది?
తెలంగాణ బీజేపీ నేతల తీరుపై గరం గరంగా ఉన్నారట ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్. అదీ కూడా అలా ఇలా కాదు. బూతులు తిట్టాలన్నంత కసిగా ఉన్నారట. ఎలక్షన్ టైంలో ఎందుకలా అంటే…చెప్పినవి, చేయాల్సిన పనులు చేయనప్పుడు తిట్టక ముద్దు పెట్టుకుంటారా అన్నది పార్టీ వర్గాల మాట. అసలు రాష్ట్ర నేతల తీరుపై కిందా మీదా కాలిపోతోందట బన్సల్‌కి. తాను రాష్ట్రానికి వచ్చినప్పుడు రివ్యూలు చేయడం, ప్రోగ్రాంలు ఇచ్చి వెళ్ళడం మినహా ప్రోగ్రెస్ ఏమీ ఉండటం లేదంటూ తెగ మండిపడుతున్నట్టు తెలిసింది. ఒకసారి చెప్పి వెళ్ళిన పనులు మళ్ళీ తాను వచ్చేదాకా చేయడం లేదని, రాష్ట్ర పార్టీ నేతలు అసలు వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని జాతీయ ప్రధాన కార్యదర్శి తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలిసింది. ఇక్కడి నేతలకు కూడా ఆయన వస్తున్నారని తెలియగానే… ఒకటి రెండు రోజుల ముందు హడావుడి చేయడం, తర్వాత ఆయనెవరో మేం ఎవరో అన్నట్టుగా ఉండటం రొటీన్ అయిపోయిందన్నది పార్టీ వర్గాల టాక్. ఈ తీరుతో విసిగిపోయారట బన్సల్. తాజాగా జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఈ విషయాన్నే ఆయన పట్టి పట్టి ప్రశ్నించినట్టు తెలిసింది. మీరిక మారరా? ఎలక్షన్ ఇక ఎన్ని రోజులు ఉందనుకుంటున్నారంటూ వరుసబెట్టి తలంటినట్టు తెలిసింది.
కేంద్ర ప్రభుత్వ లబ్దిదారుల సంపర్క్ అభియాన్ పై సమీక్ష చేసిన బన్సల్ ఇప్పటి వరకు పెద్దగా పని జరగక పోవడంతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారట. కొందరు నేతల్ని మందలిస్తూ… మీకన్నా మణిపూర్ నయం అంటూ కడిగిపారేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే మీటింగ్‌లో మరో అంశం మీద చర్చ జరిగినప్పుడు మీరు దేనికైనా సమర్థులే…. ఏదైనా చేస్తారు అంటూ వెటకారంగా మాట్లాడారట. B కేటగిరీలో ఉన్న అసెంబ్లీలని Aలోకి మారుస్తారు. Cలో ఉన్నవాటిని Bకి మారుస్తారంటూ ఎద్దేవా చేసినట్టు తెలిసింది. ఈ బీలు ఏల గోల ఏంటంటే…. పార్టీకి ఉన్న బలాన్ని బట్టి నియోజకవర్గాలను కేటగిరీలుగా విభజించింది పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో బలం ఉన్న చోట నిధులు ఎక్కువగా ఖర్చు పెట్టేలా, బలం తక్కువగా ఉన్న సీ గ్రేడ్‌కు నిధులు తక్కువ ఇచ్చేలా ప్లాన్ చేశారు. కానీ… లోకల్ లీడర్స్ మాత్రం తమకు నిధులు ఎక్కువగా రావాలన్న టార్గెట్‌తో గ్రేడ్స్‌ని మార్చేసినట్టు బన్సల్ దగ్గర సమాచారం ఉందట. అలా బలంలేని చోట ఎక్కువ నిధుల్ని తీసుకుని దుర్వినియోగం చేశారన్న రిపోర్ట్‌లు కూడా ఢిల్లీ పెద్దలకు అందాయి. దాని గురించే మళ్లీ చెప్పి వెటకారాలు ఆడినట్టు చెబుతున్నారు. గతం లో కూడా డబ్బుల విషయం ప్రస్తావిస్తే అగ్గిమీద గుగ్గిలం అయ్యారు అట సునీల్ బన్సల్. ఆ అనుభంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో ఆలాంటి పొరపాట్లు జరక్కుండా పార్టీ జాగ్రత్త పడుతోంది. అభ్యర్థుల ఆర్థిక స్థితి గతులు, పార్టీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక సహకారం ఏ మేరకు అందించాలన్న నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక రాష్ట్ర పర్యటన కు వచ్చిన ప్రతి సారి నేతలకు క్లాస్ ఇచ్చి వెళ్తున్న సునీల్ బన్సల్.. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం అంటారో ననే చర్చ జరుగుతోంది. ఆయన మళ్ళీ వచ్చి ఏమంటారోనన్న చర్చ తప్ప మనం ఏం చేయాలన్న విషయం మీద పదాధికారులు శ్రద్ధ పెట్టకపోవడమే అసలు విషాదం అంటోంది టీ బీజేపీ కేడర్.