
తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదా? లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్నారా? కీలకమైన ఎన్నికల టైంలో దాని ప్రభావం పార్టీ మీద ఎంతవరకు పడబోతోంది? గ్యాప్ తగ్గించడానికి అధిష్టానం దగ్గరున్న ప్లాన్స్ ఏంటి? చక్కదిద్దే బాధ్యతలు భుజానికి ఎత్తుకోబోతోంది ఎవరు? లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి టార్గెట్ 400 అంటున్న బీజేపీ ఆక్రమంలో కొన్ని కీలకమైన రాష్ట్రాలపై ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటోంది. ఆ లిస్ట్‌లో ఉన్న తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట పార్టీ ఢిల్లీ పెద్దలు. ఎట్టి పరిస్థితుల్లో… ఇక్కడ డబుల్ డిజిట్ సీట్లు సాధించాలని ఇప్పటికే టార్గెట్ ఫిక్స్ అయింది. అందులో భాగంగానే ప్రధాని మోడీ తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించి వెళ్ళారు. రాష్ట్రంలో మిగతా రాజకీయ ప్రత్యర్థులు అందరికంటే అభ్యర్థుల్ని ఫైనల్ చేసేసింది కమలం పార్టీ. క్యాండిడేట్స్ ప్రచారం కూడా మొదలైంది. అయితే… ఇదంతా పైకి కనిపిస్తున్న సన్నద్ధత, పార్టీ పెద్దలు తీసుకొస్తున్న ఊపు మాత్రమే. క్షేత్ర స్థాయి వాస్తవం వేరుగా ఉంది. ఎక్కువ నియోజక వర్గాల్లో అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది టీ బీజేపీ. సగానికి పైగా సీట్లలో పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని బరిలోకి దించడంతో పాత కొత్తల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందట. అభ్యర్థులకు కేడర్ సహకారం పూర్తిగా లేదని తెలుస్తోంది. కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అభ్యర్థులు పెట్టే మీటింగ్‌లకు సైతం హాజరవడం లేదంటున్నారు. అలా ఎందుకయ్యా… అంటే… కొత్త నాయకులతో పాత కేడర్‌కు సమన్వయం కుదరకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
అలాగే ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా కొందర్ని ఎగదోస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు కేటగిరీలతో పాటు… తాము చెప్పిన వారికి టికెట్ ఇవ్వలేదని అలిగిన బ్యాచ్ వేరుగా ఉందట. ఇలా రకరకాల బ్యాచ్‌లు కలిసి అభ్యర్థుల్ని కంగారు పెడుతున్నట్టు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకటి రెండు చోట్ల అభ్యర్థులను మార్చాలని ఇప్పటికీ డిమాండ్స్ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నేతల మధ్య సమన్వయం మీద పార్టీ పెద్దలు ఫోకస్ చేస్తున్నారట. పార్టీకి మంచి వాతావరణం ఉంది.. ప్రజల్లో మోడీ మీద సానుకూలత ఉంది… ఈ టైమ్‌లో తేడాగా వ్యవహరించి పార్టీని దెబ్బతీయవద్దు, మీరు ఇబ్బంది పడవద్దంటూ బ్రెయిన్ వాష్ కార్యక్రమం మొదలు పెట్టినట్టు తెలిసింది. ఆ బాధ్యతలను రాష్ట్ర పార్టీ ముఖ్యులకు అప్పగించారట ఢిల్లీ పెద్దలు. ఒక్కో నేతకు రెండు లేక మూడు నియోజకవర్గాల సమన్వయ బాధ్యతను ఇచ్చినట్టు తెలిసింది. సమన్వయం కోసం పార్టీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ ఇప్పటికే రంగం లోకి దిగారు. నాగర్ కర్నూల్ , హైదరాబాద్ నేతలతో భేటీ అయ్యారాయన. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి, ప్రస్తుత అభ్యర్థి కలిసి మీటింగ్‌లు పెట్టాలని, కేడర్‌లో భరోసా నింపాలని ఆదేశించారు. నాగర్ కర్నూల్‌లో 45 శాతం ఓట్లు సాధించాలని టార్గెట్ పెట్టినట్టు తెలిసింది. అలాగే కిషన్ రెడ్డి, లక్ష్మణ్, చంద్ర శేఖర్ తివారీ, సునీల్ బన్సల్ లు వివిధ నియోజక వర్గాలకు వెళ్ళి సమన్వయ సమావేశాలు పెట్టబోతున్నారు. ఆ సమావేశాలతో అభ్యర్థులకు, శ్రేణులకు మధ్య సయోధ్య కుదురుతుందన్నది పార్టీ అధిష్టానం విశ్వాసం. ఫైనల్‌గా జరుగుతున్న ఈ సమన్వయ సమావేశాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.